ఈవీఎంలపై మరో అడుగు... కాంగ్రెస్ వార్ షురూ చేసినట్లేనా?
"మనం ఎలా ఓడిపోయాం అని ఓటరు, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటే.. అసలు మనం ఎలా గెలిచాం అని బీజేపీ నేతలు షాక్ కి గురైనట్లు" కార్టూన్లు హల్ చల్ చేస్తున్నాయి!
గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంల పాత్ర కీలకంగా మారిందని.. వీటి పనితీరు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందంటూ పలు విమర్శలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గెలిచిన వారు మాత్రం.. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు కామెంట్ చేస్తుంటే.. ఓడినవారు మాత్రం.. ఈవీఎంల పనితీరుపై పలు విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలకు సంబంధించిన వచ్చిన ఫలితాల విషయంలోనూ ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా రాగా.. ఈవీఎం లు ఓపెన్ చేసిన తర్వాత లెక్కలు మారిపోయాయని.. ఇదే సమయంలో కొన్ని ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉందని అంటున్నారు.
ప్రధానంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా కాంగ్రెస్ సాధారణ మెజారిటీని కూడా సాధించలేకపోవడంపై పలు చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఈవీఎంల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు మరిన్ని ఫిర్యాదులు చేసింది.
అవును... హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. "మనం ఎలా ఓడిపోయాం అని ఓటరు, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటే.. అసలు మనం ఎలా గెలిచాం అని బీజేపీ నేతలు షాక్ కి గురైనట్లు" కార్టూన్లు హల్ చల్ చేస్తున్నాయి!
ఈ సమయంలో... హర్యానాలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన, స్పష్టమైన అవకతవకలను ఎత్తిచూపుతూ మెమోను భారత ఎన్నికల కమిషన్ కు సమర్పించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ ‘ఎక్స్’ లోని పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ సమయంలో ఈసీ స్పందించి తగిన ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు!
ఇలా ఫిర్యాదు చేసిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నార్నాల్, దుబ్వాలి, రేవారీ, కర్నాల్, హోడల్ (ఎస్సీ), పానిపట్ సిటీ, కల్కా, ఇంద్రి, ఫరీదాబాద్ ఎన్.ఐ.టీ, బద్ఖల్, రానియా, నల్వా, పల్వాల్, పటౌడీ (ఎస్సీ), బల్లభ్ గడ్, బర్వాలా, ఉచన కలాన్, కొస్లీ, ఘరౌండా, బాద్షాపూర్ లు ఉన్నాయి!