ఢిల్లీ సీఎంగా కొత్త ముఖం.. ఆశ్చర్యకర ఎంపిక దిశగా బీజేపీ?

కొన్నేళ్ల కిందట జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.

Update: 2025-02-14 22:30 GMT

కొన్నేళ్ల కిందట జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. అప్పటివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిని, సీనియర్ నాయకులను కాదని కొత్తవారిని సీఎంలుగా చేసింది. మధ్యప్రదేశ్‌ కు మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌ లో భజన్‌ లాల్‌ శర్మ, ఛత్తీస్‌ గఢ్‌ లో విష్ణుదేవ్ సాయ్‌ లను సీఎంలు చేసింది. వీరిలో భజన్‌ లాల్‌ తొలిసారి నెగ్గినవారు కావడం గమనార్హం. వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీ లోనూ అనూహ్య నిర్ణయం ఉంటుందా? అనే ఊహాగానాలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఎంపికలో తొందరపాటు తగదని.. గత అనుభవాలతో పాటు సామాజిక పరిస్థితుల రీత్యా నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. ప్యాకేజీల సర్‌ ప్రైజ్‌ ఇవ్వబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కగా.. 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది. కానీ, ముగ్గురు ముఖ్యమంత్రులను (మదన్‌ లాల్‌ ఖురానా, సాహిబ్‌ సింగ్‌ వర్మ, సుష్మాస్వరాజ్‌) మార్చింది. అందుకనే ఈసారి సీఎంను ఆచితూచి ఎంపిక చేయాలని భావిస్తోంది.

ఢిల్లీలో ఉన్నది 70 అసెంబ్లీ సీట్లే. అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తరహాలో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా పాటించనుందట. సామాజిక సమీకరణాల రీత్యా ఈ ఎంపికలు ఉంటాయట.

ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ను ఓడించిన పర్వేష్‌ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ లు విజేందర్‌ గుప్తా, సతీష్‌ ఉపాధ్యాయతో పాటు సీనియర్‌ నేతలు మంజిదర్‌ సింగ్‌ సిర్సా, పవన్‌ శర్మ, అశిష్‌ సూద్‌ మహిళా నేతలు రేఖాగుప్తా, శిఖా రాయ్‌ లు సీఎం రేసులో ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కర్నైల్ సింగ్‌, రాజ్‌కుమార్‌ భాటియాల పేర్లూ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. హ్యాట్రిక్‌ ఎంపీ మనోజ్‌ కుమార్‌ తివారీ (గాయకుడు), కేంద్ర మంత్రి హర్ష్‌ మల్హోత్రా పేర్లను ప్రస్తావిస్తున్నారు.

ఢిల్లీ ఫలితాలు వెలువడి వారం అవుతోంది. గత శనివారం (ఫిబ్రవరి 8) ఫలితాలు రాగా, సీఎం ఎవరో తేలేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చు. అన్ని అంశాలను ఆలోచించి.. మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాకనే ఢిల్లీకి కొత్త సీఎం వస్తారు. సోమ, మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం తర్వాత ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20న సీఎం ప్రమాణం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం.

Tags:    

Similar News