ఆరంతస్తుల భవనం గోడ మనిషి పై పడితే... షాకింగ్ వీడియో!
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. నడుచుకుంటూ వెళ్తోన్న ఓ వ్యక్తిపై ఉన్నపలంగా శిథిలాలు పడిపోయాయి. దీంతో.. అతడు నెలపై పడిపోవడం కనిపించింది.;

క్రమబద్దీకరణ లేని నిర్మాణాలు కలిగించే ప్రమాదాలు, మిగిల్చే విషాదాలు గురించిన చర్చ తాజాగా దేశ రాజధానిలో జరిగిన ఘటన మరోసారి పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఇటీవల ఢిల్లీలో దుమ్ము తుఫాను సమయంలో ఓ ఆరంతస్తుల భవనానికి సంబంధించిన గోడ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చి వైరల్ గా మారింది.
అవును... శుక్రవారం దేశ రాజధానిని దుమ్ము తుఫాను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్థానిక మధు విహార్ లో గోడ కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. నడుచుకుంటూ వెళ్తోన్న ఓ వ్యక్తిపై ఉన్నపలంగా శిథిలాలు పడిపోయాయి. దీంతో.. అతడు నెలపై పడిపోవడం కనిపించింది.
ఈ సందర్భంగా స్పందించిన తూర్పు ఢిల్లీ ఏడీసీపీ వినీత్ కుమార్... రాత్రి 7 గంటల ప్రాంతంలో తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని.. తాము ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆరంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోందని.. ఆ భవనం గోడ కూలిపోయిందని తెలిసిందని అన్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని.. ఆ ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
మరోపక్క కరోల్ బాగ్ లో దుమ్ము తుఫాను కారణంగా బాల్కనీ కూలి 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తులోని బాల్కనీ బలమైన గాలుల కారణంగా కూలిపోయిందని.. ఇటీవలే ఈ నిర్మాణం పూర్తయ్యిందని.. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అటుగా వెళ్తున్న బాలుడిపై పడిందని తెలిపారు.
కాగా... శుక్రవారం ఢిల్లీలో బలమైన దుమ్ము తుఫాను, ఇద్దురుగాలులు, వర్షం కుదిపేశాయి! దీని కారణంగా ఢిల్లీ-ఎన్.సీ.పీ.ఆర్.లోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సమయంలో సాయంత్రం వేళ దేశ రాజధానిలో అకస్మాత్తుగా మార్పు కనిపించి.. టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ తగ్గిందని వాతావరణ కార్యాలయం తెలిపింది.