ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక మెట్రో కారిడార్ ఎందుకు?
దేశంలోని మిగిలిన మహానగరాల్ని పక్కన పెడితే.. దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో వ్యవస్థ ఎంత పెద్దదన్న విషయం తెలిసిందే.;

దేశంలోని మిగిలిన మహానగరాల్ని పక్కన పెడితే.. దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో వ్యవస్థ ఎంత పెద్దదన్న విషయం తెలిసిందే. నిజానికి ఢిల్లీ మెట్రో లైన్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలంటే.. కనీసం మూడు నెలల పాటు ఆ మహానగరంలో ఉండి.. అదే పనిగా మెట్రోలో ప్రయణిస్తే తప్పించి ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి.అంత భారీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలుకారిడార్ కు అదనంగా మరో బుజ్జి మెట్రో కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రత్యేక కారిడార్ లో కేవలం మూడు కోచ్ లతో మెట్రోను నడుపుతారు. ఈ కారిడార్ కేవలం 8 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. తక్కువ దూరాల్లో ప్రయాణించే వారి కోసం ఈ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు. లజపత్ నగర్ - సాకేత్ జీ బ్లాక్ రూట్ లో మూడు కోచ్ లతో ప్రత్యేక రైల్ సర్వీసును ఇందుకోసం నిర్మిస్తున్నారు. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా ఈ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు.
మిగిలిన కారిడార్ల మధ్య కనెక్టివిటీ పెంచటంతో పాటు.. ప్రస్తుతం ఉన్న కారిడార్లతో సులువుగా ఇంటర్ ఛేంజ్ కోసం ఈ లైన్ ను ఏర్పాటు చేస్తున్నారు.తక్కువ దూరం ప్రయాణం చేసే వారి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కారిడార్ కు ప్రయాణికుల రద్దీ మీద పక్కా అంచనాలతోనే ముందుకు వెళుతున్నారు. ఒక్కో కోచ్ లో దాదాపు 300 మంది ప్రయాణించొచ్చని..అంటే ఒక ట్రిప్ లో 900 మందిని గమ్యస్థానాలకు చేరుకునే వీలు ఉంటుంది. ఈ 8 కి.మీ. కారిడార్ లో మొత్తం 8 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్ ను 2028 నాటికి పూర్తి అయ్యేలా పనులు చేపట్టారు.