బ్రేకింగ్: కూలిన ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1 పైకప్పు

ఉన్నట్లుండి ఒక్కసారి పెద్ద శబ్ధంతో కూలిన పైకప్పు పలు కార్ల మీద పడింది.

Update: 2024-06-28 04:20 GMT

దేశ రాజధానిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గడిచిన కొద్దిరోజులుగా హీట్ వేవ్ తో దేశ రాజధాని ప్రజల్ని అల్లాడించిన ఎండ తగ్గి.. రెండు రోజులుగా వర్షాలు పడుతున్న పరిస్థితి. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1కు సంబంధించిన పైకప్పు కొంత భాగం కూలిన షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నట్లుండి ఒక్కసారి పెద్ద శబ్ధంతో కూలిన పైకప్పు పలు కార్ల మీద పడింది. ఈ శిథిలాల కింద ఒకరు చిక్కుకున్నారు.

ఈ ప్రమాదం జరిగినంతనే అగ్నిమాక సిబ్బంది వచ్చి.. శిథిలాల కింద పడిన వ్యక్తిని రక్షించారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున వాహనాలు దెబ్బ తిన్నాయి. ఈ తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఘటనను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

సహాయక చర్యలు కొనసాగతాయని.. టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన విమానయాన సంస్థలకు సూచన చేశారు. ఈ ఘటనలో గాయపడిన అందరిని ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. టెర్మినల్ 1 పైకప్పు నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారు? దీని నిర్వాహణ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారు? పాక్షికంగా కూలే వరకు దీన్ని ఎవరూ ఎందుకు గమనించలేకపోయారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉండే ఎయిర్ పోర్టులాంటి చోట ఇలాంటివి చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News