నోటీసులంతా ఎన్నికల డ్రామాయేనా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు సీబీఐ 41ఏ సెక్షన్ కింద నిందితురాలిగా చేర్చింది

Update: 2024-02-24 04:26 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు సీబీఐ 41ఏ సెక్షన్ కింద నిందితురాలిగా చేర్చింది. ఇంతకుముందే ఈనెల 26వ తేదీన విచారణకు రావాల్సిందిగా నోటీసు జారీచేసిన విషయం తెలిసిందే. నిందితురాలిగా చేర్చటం కీలక పరిణామమనే చెప్పాలి. అయితే ఇంత సడెన్ గా సీబీఐ కవిత విషయంలో ఎందుకు దూకుడుపెంచినట్లు ? చివరిసారిగా కవితను సీబీఐ విచారించింది దాదాపు ఏడాది క్రితం. ఇంతకాలం ఏమీ మాట్లాడకుండా హఠాత్తుగా సీబీఐ రంగంలోకి దిగాల్సినంత అవసరం ఏమొచ్చింది ?

ఇక్కడే అందరిలోను బీజేపీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదేమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసింది. కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయకపోవటాన్ని ప్రధానంగా తమ ఆరోపణలకు నిదర్శనంగా చెప్పింది. దాన్ని జనాలందరు నమ్మారు. బీఆర్ఎస్ కు ఓట్లేసినా, బీజేపీకి ఓట్లేసినా ఒకటే అని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ప్రచారం చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ, బీఆర్ఎస్ సరిగ్గా తిప్పికొట్టలేకపోయాయి.

పైగా అప్పటివరకు నరేంద్రమోడీని నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీయార్ లిక్కర్ స్కామ్ లో కూతురు పాత్ర బయటపడేసరికి నోరిప్పలేదు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటమే మానేశారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అని నిర్ధారణ చేసుకున్నారు. అందుకనే రెండు పార్టీలను కాదని కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే సీన్ రిపీటివుతుందని బీజేపీ భయపడుతోంది. ఎన్డీయేలో కేసీయార్ చేరబోతున్నారనే ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది.

తన కూతురును రక్షించుకునేందుకే కేసీయార్ పార్టీని, అధికారాన్ని పణంగా పెట్టారనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. అందుకనే మెజారిటి సీట్లను గెలుచుకోవాలంటే ముందు కవితకు నోటీసులిచ్చినట్లు, అరెస్టు చేయబోతున్నట్లు కలరింగ్ ఇవ్వాలని లోకల్ బీజేపీ నేతలు అగ్రనేతలకు చెప్పుకున్నారట. అందుకనే సడెన్ గా నోటీసులతో సీబీఐ హడావుడి మొదలుపెట్టింది. ఈ నోటీసులన్నీ దేనికంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటికాదని చెప్పుకోవటానికేనట. నిజంగా అదే నిజమైతే లిక్కర్ స్కామ్ లో అంతమందిని అరెస్ట్ చేసిన ఈడీ మరి కవితను మాత్రం ఎందుకని అరెస్ట్ చేయలేదు ? దీనికి మాత్రం బీజేపీ సమాధానం చెప్పటంలేదు.

Tags:    

Similar News