లగ్జరీ ఇళ్ల కోసం ఎన్ని వందల కోట్లు అయినా..
భారతదేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఖరీదైన ఇళ్ల కోసం ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా వెనుకాడడం లేదు.;

భారతదేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఖరీదైన ఇళ్ల కోసం ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఈ విషయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి జోష్ లో ఉంది.. ముఖ్యంగా అత్యంత ఖరీదైన గృహాల అమ్మకాలు గత ఏడాది రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2024లో ఒక్కోటి రూ. 100-200 కోట్లకు పైగా విలువ చేసే 25 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోయాయి. వీటి మొత్తం విలువ అక్షరాలా రూ. 3,652 కోట్లు. ఇది గత రికార్డులను అధిగమించిందని ఒక నివేదిక వెల్లడించింది.
అల్ట్రా-హై నెట్ వర్త్ వ్యక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ ఊపు ఆగేలా కనిపించడం లేదు. 2025 మొదటి రెండు నెలల్లోనే నాలుగు విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోయాయి. వీటి మొత్తం విలువ రూ. 850 కోట్లు. ఈ అద్భుతమైన వృద్ధి గత సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువ. 2023లో రూ. 2,259 కోట్ల విలువైన 14 విలాసవంతమైన ఇళ్లు, 2022లో రూ. 1,583 కోట్ల విలువైన 10 ఇళ్లు అమ్ముడయ్యాయని జెఎల్‌ఎల్ ఇండియా నివేదిక తెలిపింది.
గత మూడేళ్లలో ముంబై , ఢిల్లీ NCR వంటి ప్రధాన నగరాల్లో ఒక్కోటి రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన 49 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. "అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. సంపన్న కొనుగోలుదారుల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా భారతదేశ విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి ఈ విలాసవంతమైన గృహాల అమ్మకాల పెరుగుదల నిదర్శనం" అని జేఎల్ఎల్ సంస్థ చేసిన సర్వేలో పేర్కొంది.
ఈ ప్రత్యేకమైన గృహ కొనుగోలుదారులు ఈ విలాసవంతమైన నివాసాలలో మొత్తంగా రూ. 7,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో సగం (రూ. 3,652 కోట్లు) ఒక్క 2024లోనే పెట్టుబడి పెట్టారు. రూ. 100 కోట్లకు పైగా ధర పలికిన 49 ఇళ్లలో ముంబై వాటా 69 శాతంగా ఉంది. ఇప్పుడు బంగ్లాల (35 శాతం) కంటే అపార్ట్‌మెంట్‌లే (65 శాతం) విలాసవంతమైన విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా లావాదేవీలు రూ. 100-200 కోట్ల మధ్య జరిగాయని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది.
గతంలో ఉన్న అభిప్రాయాలకు విరుద్ధంగా బంగ్లాలు - విల్లాలు వంటి స్వతంత్ర గృహాలు మాత్రమే అత్యంత ఖరీదైన నివాసాలకు చిహ్నం కాదు. ప్రత్యేకమైన రిసార్ట్ లాంటి సౌకర్యాలు.. గోప్యతను కలిగి ఉన్న అద్భుతమైన అపార్ట్‌మెంట్‌లతో విలాసవంతమైన జీవనశైలిని పునర్నిర్వచించేందుకు ఆకాశమే హద్దుగా ఎన్ని వందల కోట్లు పెట్టి కొనడానికైనా విలాసవంతులు వెనుకాడడం లేదు. ఇదే డిమాండ్ పెరగడానికి కారణం..
ఇటువంటి ఎత్తైన అపార్ట్‌మెంట్‌లు ఈ ప్రత్యేక విభాగంలో ప్రత్యేకమైన నివాస అనుభవాన్ని అందిస్తాయి. "మా విశ్లేషణ ప్రకారం.. గత మూడేళ్లలో జరిగిన మొత్తం ఒప్పందాలలో రూ. 100 కోట్లు.. అంతకంటే ఎక్కువ ధర కలిగిన అపార్ట్‌మెంట్‌ల వాటా 65 శాతం కాగా బంగ్లాల వాటా మిగిలిన 35 శాతం" అని నివేదిక పేర్కొంది.
"అయితే కొన్ని ఆస్తులు ఈ ధర కంటే ఎక్కువ పలికాయి. వాటి ధర రూ. 200-500 కోట్ల మధ్య ఉంది" అని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ , రీసెర్చ్ అండ్ ఆర్ఈఐఎస్ హెడ్ సమంతక్ దాస్ అన్నారు. గత 3 సంవత్సరాలలో రూ. 100 కోట్లు , అంతకంటే ఎక్కువ ధర కలిగిన అపార్ట్‌మెంట్‌లలో చాలా వరకు 10,000 - 16,000 చదరపు అడుగుల (సూపర్ బిల్ట్-అప్ ఏరియా) పరిధిలో ఉన్నాయి.
వివిధ మార్కెట్ అంచనాల ప్రకారం.. 2023తో పోలిస్తే 2024లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవలి కాలంలో భారతదేశంలో పెరుగుతున్న సంపన్నులు ఈ ఆస్తులను చురుకుగా కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన గృహాలను అభివృద్ధి చేయడానికి వస్తుండటంతో ఈ పరిమిత సంఖ్యలో ఉన్న యూనిట్ల డిమాండ్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది అని జేఎల్ఎల్ తెలిపింది.