చంద్రబాబు గాలి తీసిన మాజీ ప్రధాని
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి తీసినంత పని చేశారు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ.
నాలుగు గోడల మధ్య.. గుట్టుగా సాగిన ఒక వ్యవహారానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించటం ద్వారా గుట్టు రట్టు చేయటమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి తీసినంత పని చేశారు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకు మోడీ గండి కొట్టటమే కాదు.. ఆయన్ను ఏపీకే పరిమితం కావాలన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారా? అంటే అవునన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ విషయాల్ని ఏదో ఒక వేదిక మీద చెబితే ఓకే. కానీ.. రాజ్యసభలో ప్రసంగించిన సమయంలో చెప్పటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉండటం ఇబ్బందికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ప్రధాని అయిన గడిచిన మూడు ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు. అందులో భాగంగా 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఎన్డీయే కూటమిలోని వివిధ ప్రాంతీయ పార్టీల కారణంగా మోడీ 3.0కు 305 సీట్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాక.. కూటమికి పవర్ సెంటర్ గా చైర్ పర్సన్ ఉండేవారని.. కానీ ప్రధాని మోడీ మాత్రం కూటమిని నడిపించటానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటానికి ఎవరినీ అనుమతించలేదున్నారు. 2024లో మోడీకి 240 సీట్లు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు జోక్యానికి నో చెప్పారన్నారు. ఎన్డీయే కూటమికి వైస్ ఛైర్మన్ లేదంటే ఛైర్మన్ కావాలని చంద్రబాబు కోరుకున్నారని.. కానీ మోడీ మాత్రం రిజెక్టు చేశారన్నారు.
పాలన ఎలా నిర్వహించాలో మోడీకి తెలుసన్న దేవగౌడ.. ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోడీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడిపే నాయకుడిగా పేర్కొన్నారు. తాను నిజం చెబితే అంగీకరించాలని.. తాను ఏదైనా తప్పు మాట్లాడితే తనపై దాడి చేయొచ్చన్నారు. మొత్తంగా చంద్రబాబు ఎపిసోడ్ ప్రస్తావించటం ద్వారా మోడీ బలాన్ని.. ఆయనకున్న ధీమాను చెబుతూనే.. చంద్రబాబు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని బయటపెట్టారని చెప్పాలి.
అయితే.. దేవెగౌడ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు కం కేంద్రమంత్రి జేపీనడ్డా మాట్లాడుతూ.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఎన్డీయేలో చంద్రబాబును ఛైర్మన్ చేయాలన్న దానిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. నిజానికి.. చంద్రబాబు ఉన్న పరిస్థితికి ఎన్డీయే ఛైర్మన్ కావాలన్న ఆలోచనను ఆయన లేశ మాత్రం కూడా బయటపెట్టలేదు. అలాంటప్పుడు దేవెగౌడ ఎందుకు ఆ విషయాల్ని ప్రస్తావించారు? ఆయన చెప్పినట్లు జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. ఏదో ఒక రోజున ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇవ్వటం ఖాయం. అప్పటివరకు దేవెగౌడ వ్యాఖ్యల్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.