ఆర్ధిక రిజర్వేషన్లు ..సీరియస్ డిస్కషన్ పాయింట్ !

ఇంతకంటే తక్కువ టైం లో మిగిలిన దేశాలు కూడా అభివృద్ధి చెందిన విషయాన్ని చూడాలి.

Update: 2024-12-18 03:53 GMT

ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించి అక్షరాలా 77 ఏళ్ళు పూర్తి అయ్యాయి. మరో మూడేళ్లలో ఎనభై ఏళ్ళు వస్తాయి. కాలం దృష్టిలో 80 అంటే చిన్న నంబర్ అయినా మామూలుగా ఆలోచిస్తే మాత్రం అది పెద్ద నంబర్ గానే చూడాలి. ఇంతకంటే తక్కువ టైం లో మిగిలిన దేశాలు కూడా అభివృద్ధి చెందిన విషయాన్ని చూడాలి. అణు బాంబు దాడిలో మొత్తం పోయినా జపాన్ తక్కువ సమయంలోనే నిలబడి ఈ రోజు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్ధిక వ్యవస్థగా మారింది. ఆ దేశాన్ని స్పూర్తిగా తీసుకోవాల్సి ఉంది అని చెబుతారు.

అలాగే ఎన్నో చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో తమ మార్క్ ని చూపించుకుంటున్నాయి. ఈ రోజుకీ విద్య వైద్యం వంటి కీలక రంగాలలో దేశం ప్రపంచ ర్యాంకింగులలో ఎక్కడో ఉంది. ఇక పేదరికం ఈ దేశంలో బాగా తగ్గిపోయింది అని ఒక పక్కన చెబుతున్న పాలకులు మరో వైపు మొత్తం 140 కోట్ల మంది ప్రజానీకంలో 80 కోట్ల మందికి చౌక దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డు మీద ఉచిత బియ్యాన్ని ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నారు.

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోతే ఇంకా చౌక దుకాణాలలో మొత్తం జనాభాలో మెజారిటీకి ఉచిత బియ్యాలు ఎందుకు ఇస్తున్నారు అన్నది ఆలోచించాలి. ఇక అభివృద్ధి అన్ని రంగాలలో సాధించామని చెబుతున్నా అంతర్జాతీయ ర్యాంకులలో వెనకబడే ఉంటున్న సంగతీ విధితమే.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఈ దేశంలో అభివృద్ధిని పెంచాలన్నా పేదరికం పూర్తిగా నిర్మూలించాలన్నా కొత్త మార్గాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ దేశంలో లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసినా పేదరికం మాత్రం పోవడం లేదు, అభివృద్ధి ఫలాలూ అందరికీ దక్కడంలేదు. ఇది సీరియస్ మ్యాటరే అని మేధావులు సైతం అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ దేశానికి ఒకనాడు ప్రధానిగా పనిచేసిన ప్రముఖ నాయకుడు, బీసీ నేత జేడీఎస్ అధినేత అయిన హెచ్ డీ దేవేగౌడ తాజా పార్లమెంట్ సమావేశాలలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

కులం ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగించాలా లేక ఆర్థిక స్థితి మీద రిజర్వేషన్లు కల్పించాలా అన్న విషయం మీద పార్లమెంట్ పునరాలోచించాలని ఆయన కోరారు. నిజంగా ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్ గానే అంతా చూస్తున్నారు. తొంబై ఏళ్ల సీనియర్ సిటిజన్ గా ఉంటూ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశానికి ప్రధానిగా పనిచేసిన పెద్దాయన మాటలు అంటే పూర్తిగా అనుభవం నిండి చేసినవే అని భావించాల్సి ఉంటుంది.

ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ గతంలో కుల ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లతో ప్రజల స్థితిని మార్చలేకపోయారని అసలు విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు. రిజర్వేషన్ల ఫలాలు అమలు అయితే ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి తిప్పలు పడుతున్న వారు అనేక మంది ఉన్నారని ఆయన అంటూ గుర్తు చేస్తూ ఎత్తి చూపారు.

అందువల్ల ఈ దేశంలో పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలా లేక ఆర్ధిక స్థితిపై ఇవ్వాలా అన్నది మనసు పెట్టి ఆలోచన చేయాలని దేవెగౌడ కోరారు. దీని మీద పార్లమెంట్ లో చర్చించాల్సిందే అన్నది ఆయన డిమాండ్ గా ఉంది. ఈ రకమైన అంశాన్ని ఎంచుకుని పార్లమెంట్ లో మాట్లాడడం ద్వారా దేవేగౌడ రాజకీయ నేత నుంచి రాజనీతి కోవిదుడుగా మారారని అంటున్నారు.

ఈ దేశానికి ఇదే సరైన సమయం. పేదరికానికి కులం లేదు మతం లేదు. అందువల్ల పేదరికం అన్నది నిర్మూలించాలీ అంటే ఆర్ధికతనే ప్రమాణంగా తీసుకుని రిజర్వేషన్లు ఇవ్వాలని మేధావులు డిమాండ్ చేస్తునే ఉన్నారు. ఇపుడు పెద్దాయన ఈ రోజుకీ పార్లమెంట్ కి వస్తున్న ఒక మాజీ ప్రధానిగా దేవెగౌడ ఇచ్చిన సలహానూ సూచనను అన్ని పార్టీలు ఆలోచించి ఒక నిర్దిష్ట విధానంతో ముందుకు వస్తే దేశానికి మేలు జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News