తన మనవడు లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ ఫస్ట్ రియాక్షన్!

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారం ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-18 10:03 GMT

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారం ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కో సంచలన విషయం తెరపైకి వస్తుంది. ఈ విషయంలో సిట్ తనపని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ సమయంలో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు.

అవును... తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో... దేవెగౌడ మొట్ట మొదటిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా... ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో చాలా మందికి ప్రమేయం ఉందని, వారెవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.

తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ... "ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు.. అయితే, చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌.డీ కుమారస్వామి చెప్పాడు.. ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ.. వారిపై కూడా చర్యలు ఉండాలి" అని హెచ్‌.డీ దేవెగౌడ అన్నారు. ఇదే సమయంలో... "ప్రజ్వల్‌ తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు" అని గుర్తు చేశారు!

మరోపక్క.. కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ప్రజ్వల్ తండ్రి హెచ్‌.డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తన కుమారుడిపై ఉన్న లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను కిడ్నాప్ చేసిన కేసులో మే 4న ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదని వారు తెలిపారు.

ఇందులో భాగంగా... రేవణ్ణను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రాగా... ఆ సమయంలో తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉన్న ఆయన.. సాయంత్రం 5:17 గంటల నుంచి 6:50 గంటల వరకు సరైన సమయం కాదని ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు. అయితే... సాయంత్రం 6:50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోయారు!

Tags:    

Similar News