మోడీ వారసుడన్న ప్రచారంపై ఆ సీఎం కీలక వ్యాఖ్యలు
తాజాగా అలాంటి పరిస్థితుల్లో తనదైన గడుసుతనాన్ని ప్రదర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అప్పుడప్పుడు మొదలయ్యే ఆసక్తికర రాజకీయ వాదనలు కొందరు నేతలకు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెడితే.. మరికొందరికి గుది బండగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితుల్లో తనదైన గడుసుతనాన్ని ప్రదర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీకి.. రాజకీయ వారసుడు ఎవరు? అన్న అంశంపై ఆసక్తికర చర్చ ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి వేళ.. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లకు మరోకొత్త పేరు అదనంగా వచ్చి చేరింది.
పొలిటికల్ గా ప్రధాని నరేంద్ర మోడీకి నిజమైన వారసులుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్.. అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పేర్లు వినిపిస్తూ ఉండటం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లను ఓటర్లు కట్టబెట్టేలా చేయటంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక భూమిక పోషించారన్న ప్రచారం సాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ వారసుడిగా ఆయన పేరు తరచూ చర్చకు వస్తోంది.
ఇదే విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ను ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధాన్ని ఇచ్చారు. మోడీ వారసత్వాన్ని అందుకునే అవకాశం ఉన్న వారిలో మీ పేరు కూడా వినిపిస్తోందని చెప్పినప్పుడు.. తాను మోడీ ఐడియాలజీకి వారసుడిగా పేర్కొన్నారు. "ఎవరి వారసుల జాబితాలోనూ నేను లేను. ఏ సిద్ధాంతాలతో అయితే నరేంద్ర మోడీ పని చేస్తున్నారో.. ఆ సిద్ధాంతాలకు నేను వారసుడిని. అందుకు కట్టుబడి ఉంటాను.ఆ సిద్ధాంతాలను మున్ముందు కొనసాగిస్తాను" అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఫడ్నీవీస్ కేంద్రంలో కీలక భాధ్యతలు అప్పగిస్తే తీసుకునేందుకు ఇష్టపడతారా? అని అడగ్గా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని.. ఐదేళ్లు తనను ఇక్కడే ఉంచాలంటూ నవ్వుతూ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ తరహాలో ఆఖండ విజయానికి కారణమైన అంశాల్లో లాడ్లీ బెహన్ యోజనగా.. ఫడ్నవీస్ చెప్పుకోవటం ఆసక్తికరంగా మారింది.