అవినాష్‌కే టీడీపీ అవసరం.. ఈ లెక్క గుర్తుందా..?
దేవినేని అవినాష్.. ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లోనే కాదు.. అధికార పార్టీ టీడీపీలోనూ పెద్ద ఎత్తున జరుగుతు న్న చర్చ.
దేవినేని అవినాష్.. ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లోనే కాదు.. అధికార పార్టీ టీడీపీలోనూ పెద్ద ఎత్తున జరుగుతు న్న చర్చ. నిరంతరం ఏదో ఒక రూపంలో వినిపిస్తున్న పేరు కూడా. దీనికి కారణం..ఆయనపై టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఉండడమే. దీంతో ఆయన ఈ కేసు నుంచి బయటకు వచ్చేందుకు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారన్నది గత వారం రోజులుగా జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో కొందరు సీనియర్ నాయకులకు అవినాష్ టచ్‌లో ఉన్నార ని.. గతంలో తన తండ్రి మిత్రులతో ఆయన మంతనాలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే విజయవాడ రాజకీయాల్లో అవినాష్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. అవినాష్ అవసరం టీడీపీకి ఉందా? అనేది ఇప్పుడు దేవినేని కుటుంబానికి తటస్థంగా ఉండే నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఒక నాయకుడి అవసరం.. పార్టీకి ముఖ్యం. పైగా ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి. కనుచూపు మేరలో ఎన్నికలు కూడా లేవు. ఇలాంటి సమయంలో దేవినేని అవినాష్ అవసరం ఎంత? అనేది ప్రశ్న. పైగా ఆయనను తీసుకుంటే.. ప్రత్యేకంగా పార్టీకి వచ్చే మైలేజీ కూడా ఏమీ లేదన్నది అభిప్రాయం.
సామాజిక వర్గం పరంగా చూసుకున్నా.. విజయవాడ తూర్పులో అవినాష్ అవసరం టీడీపీకి లేదు. ఇక, ఇప్పటికే ఇక్కడ గద్దె రామ్మోహన్ వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన గెలుస్తూనే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు సాలిడ్‌గా ఆయనకే పడుతున్నాయి. దీనికి గండి కొట్టాలన్న వ్యూహంతోనే వైసీపీ దేవినేని అస్త్రాన్ని వినియోగించింది. కానీ, వర్కవుట్ కాలేదు. దీనికితోడు భారీ ఫాలోయింగ్ ఏమైనా ఉందా? అంటే అది కూడా లేదు.
ఇలా.. అనేక సమీకరణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. టీడీపీకి దేవినేని అవసరం లేదు. అయితే.. అసలు అవసరం దేవినేనికే ఉందనేది కూడా ఇక్కడ జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. టీడీపీని కాదని బయటకు వచ్చిన తర్వాత.. దేవినేని కుటుంబం పెద్దగా సంపాయించుకున్న రాజకీయ పరపతి ఏమీ లేదు. టీడీపీలో ఉండగా అప్రతిహత విజయం దక్కించుకున్న ఈ కుటుంబం.. కాంగ్రెస్‌లోకి వచ్చింది. 2004లో ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. అన్నీ ఓటములే. సో.. దేవినేని కుటుంబం అంటే.. టీడీపీ కుటుంబంగానే ప్రజలు గుర్తించారు తప్ప.. వ్యక్తిగతంగా కాదనే అభిప్రాయం ఉంది. అందుకే.. ఇప్పుడు అవినాష్‌కు టీడీపీ అవసరం ఉందే తప్ప.. టీడీపీకి అవినాష్ అవసరం లేదనేది చర్చల సారాంశం. అయితే.. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్లకు టీడీపీ మనసు మారే అవకాశం లేక పోలేదన్న చర్చ కూడా జరుగుతోంది.