దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ రాకుండా చెక్ పెట్టిన ఆ ఇద్దరు..?
దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కింగ్... ఇక తెలుగుదేశం రాజకీయాలను అయితే 1999 ఎన్నికల నుంచి 2019 ఎన్నికలకు ముందు వరకు తానే నడిపించారు.;
దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కింగ్... ఇక తెలుగుదేశం రాజకీయాలను అయితే 1999 ఎన్నికల నుంచి 2019 ఎన్నికలకు ముందు వరకు తానే నడిపించారు. నాలుగుసార్లు ఓటమి లేకుండా గెలవడంతో కృష్ణా జిల్లా తెలుగుదేశంలో ఆయన హవా అంతా ఇంతా కాదు అన్నట్టుగా నడిచింది. నందిగామ నుంచి 1999, 2004లో నందిగామ నుంచి ఆ తర్వాత 2009, 2014లో మైలవరం నుంచి గెలిచారు. మరీ ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో ఉమా చేసిన పోరాటాలకే ఆయనకు చంద్రబాబు కీలకమైన భారీ నీటిపారుదల శాఖా మంత్రి పదవి కట్టబెట్టారు.
అయితే టీడీపీలో జిల్లాలో ఒంటెద్దు పోకడలతో కూడిన రాజకీయం చేయడంతోనే జిల్లాలో కొడాలి నాని, కేశినేని నాని, వల్లభనేని వంశీ, మండలి బుద్ధప్రసాద్, దాసరి బాలవర్థన్‌రావు లాంటి వారు టీడీపీకి దూరమయ్యారు. ఇక నెట్టెం రఘురాంతో పాటు బొండా ఉమాతోనూ.. ఇలా ఎవ్వరితోనూ ఉమాకు సరిపోదు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమా ప్రాభవం జిల్లాలో తగ్గుతూ వచ్చింది. చివరకు 2019 ఎన్నికల నాటికి ఉమాకు ఎమ్మెల్యే సీటే రాని పరిస్థితి వచ్చేసింది.
జిల్లాలో ఉన్న మిగిలిన టీడీపీ నేతలు అందరూ ఉమా తీరుపై చంద్రబాబు కంటే కూడా లోకేష్‌కు ఎక్కువుగా ఫిర్యాదు చేయడంతో లోకేష్ ఎఫెక్ట్‌తోనే ఉమా సీటు చిరిగిపోయిందన్న టాక్ కూడా పార్టీలో ఉంది. మొన్న ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి తాను 2019లో ఓడిపోయిన వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ సీటు రాగా ఉమా తన సీటు త్యాగం చేశారు. అప్పుడే చంద్రబాబు ఉమాకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమా పేరు ముందు రేసులో ఉన్నా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరూ చక్రం తిప్పి ఉమాకు ఎమ్మెల్సీ రాకుండా చేశారన్న గుసగుసలు జిల్లా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఉమాకు ఎమ్మెల్సీ ఇస్తే మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో రెండో గ్రూప్‌తో పాటు మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని.. అప్పుడే ఉమాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మరో రెండేళ్ల తర్వాత ఇవ్వాలని చిన్ని, వసంత చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర పట్టుబట్టడంతోనే ఉమాకు ఎమ్మెల్సీ రాలేదని అంటున్నారు. ఏదేమైనా ఉమా రాజకీయ ప్రభ రోజు రోజుకు మరింత మసకబారుతోందన్నది వాస్తవం.