సైకిల్ ఎక్కేందుకు దేవినేని అవినాష్ మంతనాలు?
ఈ నేపథ్యంలోనే విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో అహంకారంతో వ్యవహరించిన పలువురు నేతలు ఆ పార్టీ 2024 ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడడంతో ఇప్పుడు సంకట పరిస్థితిలో పడ్డారు. రాబోయే ఐదేళ్లపాటు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్టీలో కొనసాగడం కష్టమని భావించిన కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తుండగా మరికొందరు నేతలు టీడీపీ తలుపు తట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
తన తండ్రి, దివంగత నేత దేవినేని రాజశేఖర్ కు సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె బాబురావు వంటి నేతలతో అవినాష్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ ఇద్దరు నేతలు లోకేష్ దగ్గర ప్రస్తావించగా అవినాష్ చేరికకు లోకేష్ అంత సుముఖంగా ఉన్నట్టుగా కనిపించలేదని తెలుస్తోంది. విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గతంలో యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పై నోరు పారేసుకున్నారు.
విజయవాడలో అడుగు పెట్టేముందు క్షమాపణ చెప్పాలంటూ లోకేష్ ను అవినాష్ కోరిన వైనంపై లోకేష్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇక, మరోవైపు అవినాష్ భార్య సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి అవినాష్ పై ఉన్న కేసుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో దేవినేని అవినాష్ కీలకపాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోని అవినాష్ పై ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. దీంతో, ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
2024 ఎన్నికలలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ చేతిలో దేవినేని అవినాష్ 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడలో కొడాలి నాని పై పోటీ చేసిన అవినాష్ ఓటమిపాలైన వెంటనే వైసీపీలో చేరిపోయారు.