దేవినేని ఉమా జంప్... మైలవరం టీడీపీలో రగడ!
ఉమ్మడి కృష్నాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఉమ్మడి కృష్నాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు. ఈసారికి సర్దుకోవాలని సూచించారు. ఈయన ప్లేస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చారు. ఇక, బీఫాం ఇచ్చే సమయంలోనూ ఇద్దరినీ ఆఫీసుకు పిలిచిన చంద్రబాబు ఇరువురి పక్షాన సర్దిచెప్పి.. కలిసి పనిచేయాలన్నారు.
దీనికి దేవినేని ఉమా కూడా.. ఓకే చెప్పారు. బీఫాం ఇచ్చిన రోజు.. వసంత కృష్ణ ప్రసాద్‌తో చేయిచేయి కలిపి ఫొటోలకు కూడా పోజులు ఇచ్చారు. దీంతో మైలవరంలో రగడ సమసి పోయిందని.. నాయకులు సర్దుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ, అప్పట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న నాయకులు ఇప్పుడు కలిసి పనిచేయడం అంత ఈజీకాదని అనుకున్నారు. కానీ, పైకి మాత్రం ఇద్దరూ కలిసినట్టు కనిపించడంతో మంచిదే కదా! అని సర్దుకున్నారు.
కానీ, ఎన్నికల ప్రచారం ఊపందుకున్న దరిమిలా.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. దేవినే ని ఉమా.. రెండు రోజులుగా అందుబాటులో లేకుండా పోయారు. కనీసం ఆయన ఫోన్ కూడా.. అందుబా టులో లేదు. మరోవైపు.. చంద్రబాబు రెండురోజుల్లోమైలవరంలో పర్యటించి ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా.. వ్యవహారం తెరమీదికి వచ్చింది. కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏమయ్యారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పార్టీ వర్గాల మధ్య అనధికార చర్చల్లో వస్తున్న విషయం ఏంటంటే.. ఉమా అమెరికా వెళ్లిపోయారని.. వచ్చే నెల వరకు రాబోరని తెలుస్తోంది. మరికొందరు.. ఆయన సొంత పనిపై వేరే రాష్ట్రానికి వెళ్లారని.. వచ్చే వారం వస్తారని.. చెబుతున్నారు. అయితే.. పార్టీ వర్గాలు చెబుతున్న దానిలో ఏది నిజమో తెలియదు కానీ.. దేవినేని ఉమా అందుబాటులో లేరన్నది.. మైలవరంలో ప్రచారం చేయడం లేదన్నది మాత్రం వాస్తవం. టికెట్ దక్కక పోవడంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న దేవినేనిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నది కూడా వాస్తవం. మరి వచ్చే రెండు రోజుల్లో ఏమైనా జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు.