తన గెలుపోటములపై ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు!

దీంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది.

Update: 2024-03-15 05:11 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే టిక్కెట్లు దక్కినవారు.. టిక్కెట్ దక్కుతుందనే నమ్మకం ఉన్నవారూ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోతున్నారు. కార్యకర్తలను, అనుచరులను వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. ఇదే సమయంలో ఆయా సామాజికవర్గాల ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దీంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది.

ఈ క్రమంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా బిజీ అయిపోయారు.. సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లోనూ, ఆత్మీయ సమావేశాల్లోనూ, సామాజికవర్గాల సమావేశాల్లోనూ తిరుగుతూ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో తాజాగా శ్రీకాకుళంలో జరిగిన కలింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలోను ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తన గెలుపోటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... శ్రీకాకుళంలో జరిగిన కలింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... జిల్లా, నగర కళింగ వైశ్య సంఘ నాయకులు వైసీపీని గెలిపించాలని అనుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో... వారి నుంచి తనకు మద్దతు లభించదేమో అని గతంలో అనుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో ఇన్నాళ్లూ వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో అనే చిన్నపాటి సందేహం ఉండేది కానీ... రోజులు గడుస్తున్న కొద్దీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గెలుస్తాననే నమ్మకం పెరుగుతుందని తెలిపారు! ఈ సమయంలోనే... తనకు ప్రజల ఆదరణ చాలని, ఇక తాను ఓడిపోయినా పర్వాలేదని కామెంట్ చేశారు ధర్మాన ప్రసాద రావు!

కాగా... ధర్మాన ప్రసాద రావు బహిరంగ సమావేశాల్లో తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ సంచలనాలకు తెరలేపుతుంటారనే సంగతి తెలిసిందే. దీంతో... వాటిని వక్రీకరించడానికి వీలు దొరుకుతుందని అంటుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన చేయుత పథకం పంపిణీ కార్యక్రమంలో... పథకాల డబ్బులు అన్నీ మహిళల ఖాతాల్లోకే వెళ్తుండటం వల్ల తమ ప్రభుత్వంపై కొంతమంది మగాళ్లకు కోపం ఉందని అన్నారు.

దీంతో... వారంతా సైకిల్ కే ఓటు వేయమని చెబుతారని.. అయితే వారి మాటలు మాత్రం మీరు వినొద్దని.. పథకాలకు కృతజ్ఞతగా వైసీపీకి ఓటు వేయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు మహిళలకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో... తమ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని చెప్పే క్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని అప్పట్లో కామెంట్లు వినిపించాయి!

Tags:    

Similar News