ధర్మపురి శ్రీనివాస్- ఓ రాజకీయ పాఠం!
ప్రస్తుతం రాజకీయాలు అంటే.. అవకాశం-అవసరం అనే రెండు నావలపైనే ప్రయాణం చేస్తున్నాయి. కానీ, ఇది సరికాదన్నది శ్రీనివాస్.. చెప్పినమాట.
ధర్మపురి శ్రీనివాస్.. ఈ పేరు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలోనూ మార్మోగింది. నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ధర్మపురి.. కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకాన్ నాయకుడు. 1990లలో పార్టీ ఏ విషయం చర్చించాలన్నా.. ధర్మపురి శ్రీనివాస్‌ను ఢిల్లీకి పిలిచేది. ఆయన చెప్పింది విన్నాకే నిర్ణయం తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ``శ్రీనివాస్ అలా చెప్పారా.. అయితే.. అదే చేయండి`` అని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానం.. చెప్పిందంటే.. ఎంతటి విశ్వసనీయ పాత్రను ఆయన పోషించారో తెలుస్తుంది.
ప్రస్తుతం రాజకీయాలు అంటే.. అవకాశం-అవసరం అనే రెండు నావలపైనే ప్రయాణం చేస్తున్నాయి. కానీ, ఇదిసరికాదన్నది శ్రీనివాస్.. చెప్పినమాట. ఆయన ఒకానొక దశలో కాంగ్రెస్‌లో విజృంభిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కానీ, ఆయనకు దక్కలేదు. కారణాలు ఏవైనా.. ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఈ సమయంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఆయనను ఆహ్వానించింది. రండి.. మీకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆహ్వానం పంపించింది.
కానీ, డీఎస్ ఆప్రతిపాదనను ఒప్పుకోకపోగా.. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానన్నారు. చివర కు అదే చేశారు. ఇది నేటి తరం జంపింగ్ జిలానీలకు పాఠంకావాలి. అయితే.. మధ్యలో డీఎస్ కూడా .. పార్టీ మారారు. దీనికి ప్రధాన రీజన్ ఉంది. పార్టీలో యువరక్తానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న తన సూచనల ను పక్కన పెట్టిన దరిమిలా.. ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. ఇంతకుమించి.. ఆయన తనకంటూ పదవులు కోరుకోలేదు. ఇదేసమయంలో ఆయన ఎవరికీ తల ఒంచలేదు కూడా.
బీఆర్ ఎస్‌లో ఆయనకు తగిన గౌరవమే దక్కింది. అయితే.. అది తొలినాళ్లలోనే కేటీఆర్ హవా తెరమీదికి వచ్చినతర్వాత.. డీఎస్ కు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో మరుక్షణమే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ చాలా మంది ఆయనకు మరోసారి పదవిఇవ్వలేదని.. అందుకే రాజీనామా చేశారని చెబుతారు. కానీ.. అది వాస్తవం కాదని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్నీ నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న ధర్మపురి శ్రీనివాస్.. నేటి తరానికి ఒక ఐకాన్ నాయకుడు. నేర్చుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆయనో రాజకీయ పాఠం!!