సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన నటి దియా మీర్జా

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ సోషల్ మీడియాలో దీన్ని తప్పుపట్టారు;

Update: 2025-04-07 12:33 GMT
సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన నటి దియా మీర్జా

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ సోషల్ మీడియాలో దీన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో, హీరోయిన్లు సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. HCU లో విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతుగా హీరోయిన్ దియా మీర్జా AI తో రూపొందించిన చిత్రాలు , వీడియోలను ఉపయోగించారనే వాదనలు వినిపించాయి. అయితే నటి , పర్యావరణవేత్త అయిన దియా మీర్జా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఆ ఆరోపణలను ఖండించారు.

-దియా మీర్జా గట్టిగా సమాధానం

దియా మీర్జా తాజాగా X లో స్పందిస్తూ తాను AI తో రూపొందించిన చిత్రాలను పోస్ట్ చేశాననే ఆరోపణలను ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. "నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేశారు. గచ్చిబౌలి పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు" అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "వాటిలో ఒకటి ఏమిటంటే, ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతుగా నేను నకిలీ AIతో రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించాననడం పూర్తిగా అవాస్తవమైన ప్రకటన. నేను ఒక్క AI తో రూపొందించిన చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. మీడియా , తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేసే ముందు వారి వాస్తవాలను ధృవీకరించుకోవాలి." అని అన్నారు.

హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సరిహద్దులో ఉన్న 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. పట్టణ మౌలిక సదుపాయాలు మరియు ఐటీ పార్కు నిర్మాణం కోసం పర్యావరణపరంగా సున్నితమైన ఈ భూమిని వేలం వేయాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు , సుప్రీంకోర్టు రెండింటిలోనూ విచారణలో ఉంది.

ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి, పలువురు ప్రముఖులు ఈ ప్రాంతంలో చెట్ల నరికివేతపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

- తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనలు ఏమిటి?

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిస్తూ గచ్చిబౌలి భూమి సమస్యపై కొందరు ఏఐతో రూపొందించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేశారని.. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన నెమళ్లు , జింకలను చూపిస్తున్న కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన కంటెంట్‌పై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. సీతక్క, ముఖ్య కార్యదర్శి ఎ. శాంతి కుమారి, డిజిపి జితేందర్ , ఇతర అధికారులతో కలిసి ఈ విషయం లో సంబంధిత కోర్టు కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ భూమి సమస్య వివాదాస్పదంగా మారడానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో పలువురు ప్రముఖులు AI-తో రూపొందించిన వీడియోలకు బలైపోయారని.. వాటితో సోషల్ మీడియాలో స్పందించారని, దీని ఫలితంగా ఈ విషయం దాదాపు జాతీయ సమస్యగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News