నెల‌వుతున్నా నాన్చుడే.. బాబు ఫేస్ వాల్యూ త‌గ్గిందా.. ?

కొన్ని కొట్టుకుపోయాయి. ఇళ్లు కూడా బలహీనంగా మారడం తెలిసిందే.

Update: 2024-09-27 05:07 GMT

విజయవాడలో వరదలు సంభవించి దాదాపు నెల రోజులు అవుతుంది. ఈ నెల ఒకటో తారీఖున ఆదివారం ఆకస్మికంగా సంభవించిన వరదలతో విజయవాడ శివారు ప్రాంతాలైన సింగనగర్, ప్రకాష్ న‌గరు, శాంతినగర్, కండ్రిక. నున్న ప్రాంతాలు పీకల లోతు నీటిలో మునిగిపోయి దాదాపు ఐదు రోజులపాటు ప్రజలు వరద నీటిలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి ఆస్తులు, వస్తువులు, వాహనాలు అన్నీ కూడా పాడైపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి. ఇళ్లు కూడా బలహీనంగా మారడం తెలిసిందే.

అయితే బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు సేకరించింది. సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ నిధుల నుంచి ఇప్పుడు ప్రజలకు నష్టపరిహారం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే విపత్తుల సంభవించినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావడం అనేది సహజం. ఇది రాష్ట్రాలకు ఉన్న హక్కు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం 680 కోట్ల రూపాయలు పైగా నష్టపోయామని పేర్కొంటూ ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది.

ఇది పంపించి కూడా దాదాపు 20 రోజులు అయిపోయింది. అయితే ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి విడుదల కాలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం సొమ్ములిస్తుందని వాటి నుంచి ప్రజలకు ఇవ్వాలని చంద్రబాబు సహా ప్రభుత్వం భావించంది. అదే సమయంలో బుడమేరు ను మరింత పటిష్టం చేయడంతో పాటు వరదలు విపత్తులు సంభవించినప్పుడు బుడమేరు నుంచి వరదలు రాకుండా చూడాలని కూడా చంద్రబాబు `ఆపరేషన్ బుడమెరు` కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు.

అదేవిధంగా ఏలూరులో ఎర్ర వాగు పశ్చిమగోదావరిలో ఏలేరు రిజర్వాయర్ కారణంగా కూడా మునిగిపోయిన ప్రాంతాలకు కేంద్రం నుంచి వచ్చే పరిహారం నుంచి కొంత కేటాయించి ఆదుకోవాలని భావించారు. కానీ, నెలరోజులవుతున్నా ఇప్పటివరకు కేంద్ర నుంచి రూపాయి రాకపోవడం కనీసం కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు ఏం చెప్పారో తెలియకపోవడం. అసలు ఈ విషయాన్ని తమకు పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటం గ‌మ‌నార్హం.

ఇవ‌న్నీ చూస్తే బీజేపీతో కూడిన‌ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏపీని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? చంద్రబాబుకు అసలు వేల్యూ ఇవ్వడం లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే గనక నిజమైతే భవిష్యత్తులో అంటే రాబోయే నాలుగేళ్ల పైగా సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాలి. ఇబ్బందులు కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News