వివేకా హత్యకేసు: కడప జైల్లో దస్తగిరిని ట్రాప్ చేసేందుకు భారీ ఆఫర్!
వైఎస్ వివేకా దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు తర్వాతి కాలంలో కీలక సాక్షిగా మారిన దస్తగిరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకా దారుణ హత్య ఉదంతానికి సంబంధించి కీలక పరిణామాలకు తెర లేవనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సొంత బాబాయ్ దారుణ హత్య కేసుకు సంబంధించి.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏమీ చేయని జగన్ తీరుకు భిన్నంగా.. తాజాగా చోటు చేసుకుంటున్నపరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ వివేకా దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు తర్వాతి కాలంలో కీలక సాక్షిగా మారిన దస్తగిరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.
కడప జైల్లో ఉన్న తనను లోబర్చుకునే ప్రయత్నాలు భారీగా సాగినట్లుగా దస్తగిరి వెల్లడించారు. ఖైదీలకు వైద్య శిబిరం పేరుతో డాక్టర్ చైతన్యరెడ్డి కడప కేంద్ర కారాగారానికి వచ్చి తనకు భారీ ఆఫర్ ఇచ్చారని.. తాను నో చెప్పటంతో తీవ్రమైన వార్నింగ్ ఇచ్చినట్లుగా వెల్లడించి సంచలనానికి తెర తీశారు. కడప కేంద్ర కారాగారానికి ఖైదీలకు వైద్య శిబిరం పేరుతో వచ్చిన డాక్టర్ చైతన్య రెడ్డి తనను కలసి.. రూ.20 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారన్నారు. అయితే.. తాను అందుకు ఒప్పుకోలేదన్నారు. ఈ సందర్భంగా.. జైలు కాబట్టి బతికిపోయావని.. లేదంటే నరికి చంపేసేవాడినని తనను తీవ్రంగా హెచ్చరించాడన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని సీబీఐకు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇంతకూ ఈ డాక్టర్ చైతన్య రెడ్డి ఎవరు? జైల్లోనే వార్నింగ్ ఇచ్చేసే దమ్ము ఎక్కడిది. అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే.. అసలు సంగతి మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. వివేకా హత్యకేసులో ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకే ఈ చైతన్యరెడ్డి. కడపలో ఒక ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ప్రకాశ్ సాయంతో జైలు లోపలకు వెళ్లిన అతడు.. వైద్య శిబిరం పేరుతో దస్తగిరిని గత ఏడాది నవంబరు 18న కలిసిన వైనం బయటకు వచ్చింది.
కడపలో డాక్టర్ చైతన్యరెడ్డికి మించిన సీనియర్ వైద్యులు బోలెడంత మంది ఉన్నప్పటికి.. అతడినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి. తమకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలన్న ఒత్తిడిని తన మీదకు తీసుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తమను వేధింపులకు గురి చేసి.. వివేకా హత్య కేసులో తమను అఫ్రూవర్ గా మార్చినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు దిగినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి పాత్ర లేకుంటే.. అతడి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి? రూ.20 కోట్ల భారీ ఆఫర్ ఎందుకు ఇస్తారు? అన్నది ప్రశ్నలుగా మారాయి.
తాజాగా కడప జిల్లాలో జరిగిన పరిణామాలు.. దస్తగిరికి భారీ ఆఫర్ తో పాటు.. బెదిరింపులకు సంబంధించి.. ఏపీలోని కూటమి సర్కారు ఇప్పుడు విచారణకు ముందుకు రావటం సంచలనంగామారింది. ఇటీవలే వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని కూడా పోలీసులు విచారణ చేపట్టిన వైనం చూసినప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన పరిణామాలకు అవకాశం ఉంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు జారీ చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన సుప్రీం.. వారికి నోటీసులు జారీ చేయటం తెలిసిందే.
మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ ఇటీవల బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీల్.. వివేకం సినిమాలో వాస్తవాలు ఉన్నాయని.. వివేకాను చంపటం ద్వారా నష్టపోయింది ఎవరు? లాభ పడింది ఎవరు? అన్నది అందరికి కనిపిస్తోందన్నారు. వివేకా హత్య కేసులో తాను తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించిన పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా మార్పులు చోటు చేసుకుంటున్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.