బాబు జగన్ దొందూ దొందే సుమా!

వారే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్.

Update: 2024-10-11 08:30 GMT

ఇద్దరూ రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలు. ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే. ఇద్దరిదీ సుదీర్ఘమైన రాజకీయ కుటుంబమే. వారే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ ఇద్దరి విషయంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. అలాగే ఎన్నో పోలికలు ఉన్నాయి.

ఈ ఇద్దరూ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరు.అది వారు చేసే ప్రకటనలను బట్టే తెలుస్తోంది. చంద్రబాబు అయినా జగన్ అయినా విజయాన్నే ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు తప్ప అపజయాన్ని భరించలేకపోతున్నారు. దానిని తమకు దూరంగా పెడుతున్నారు

నిజానికి చూస్తే కనుక 2014లో జగన్ ఓడిన తరువాత చాలా స్పోర్టివ్ గా స్పందించారు. ఫలితాల సరళి ఒక వైపు టీడీపీకి అనుకూలంగా ఉందని తెలిసిన నేపథ్యంలో ఆయన అన్న మాటలు ఇప్పటికీ యూట్యూబులో పదిలంగా ఉన్నాయి. టీడీపీని ఉద్దేశించి దెబ్బ కొట్టారు తిన్నాం, తట్టుకుంటాం, ఓటమిని ఎంత గట్టిగా తట్టుకున్నారు అన్నదే బలం అని అన్నారు. రేపటి రోజున మేమూ ఇంతకు ఇంతా దెబ్బ కొడతామని అన్నారు. అంటే 2019లో గెలుపు మాదే అని నిబ్బరంగా జగన్ ప్రకటించారు అన్న మాట.

అదే విధంగా 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఈవీఎంల మీద చంద్రబాబు డౌట్లు పెడితే ఈవీఎంలతోనే కదా ఆయన 2014లో గెలిచింది అని కూడా మీడియా ముందు అన్నారు. గెలిస్తే ఒకలా ఓడితే మరోలాగానా అని ఆయన ఎద్దేవా చేశారు.

సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. దాంతో జగన్ ఆ రోజు సాయంత్రం మీడియా ముందుకు వచ్చి విషణ్ణ వదనంతోనే మాట్లాడారు. ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు అని తొలి డౌట్ ఒకటి పెట్టారు. ఇక పోను పోనూ అదే అంటున్నారు ఈవీఎంలదే తప్పు అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు

హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత ఆయన స్వరం మరింతగా పెరిగింది. ఏపీ ఫలితాలే హర్యానాలోనూ వచ్చాయని ఆయన అన్నారు. ఈవీఎంలు ఉండకూడదు బ్యాలెట్ పేపరే మంచిదని కూడా ఆయన నినాదం అందుకున్నారు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే 2014లో అదే ఈవీఎంలతో గెలిచి సంబరాలు చేసుకున్న ఆయన 2019 నాటికి 23 సీట్లకు పడిపోగానే ఈవీలలోదే తప్పు ఏదో గోల్ మాల్ జరిగింది అని ఆడిపోసుకున్నారు తాము గెలిచేవారమే అని అన్నారు. పసుపు కుంకుమ కింద అందరికీ అన్నీ పంచాం కదా మరి ఎందుకు గెలవలేదు అని అనుమానాలు సైతం వ్యక్తం చేశారు.

ఇలా చూస్తే కనుక చంద్రబాబు జగన్ ఇద్దరూ ఈవీఎంల విషయంలో ఇపుడు ఒక్కటే స్వరంతో మాట్లాడుతున్నారు. పైగా అదే ఈవీఎంలతో వారు గెలిచి కూడా అపుడు ఏమీ మాట్లాడకుండా ఓడినపుడే డౌట్లు పెట్టడంతోనే జనాలలో చర్చగా సాగుతోంది.

ఇక దేశంలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ హర్యానాలో నాలుగు నెలల క్రితం ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అపుడు ఈవీఎంలను ఏమీ అనలేదు, ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక మాత్రం ఏదో మాయాజాలం జరిగింది అని అంటోంది. రాజకీయ పార్టీలు అన్నీ కలసి ఇలా తడవకో మాట తమకు అనుకూలంగా ఉన్నపుడు ఒక మాట వ్యతిరేకంగా ఉన్నపుడు మరో మాట అనకుండా ఒక నిర్ణయానికి రావాలి.

బ్యాలెట్ పేపరే కావాలని పార్లమెంట్ లో తీర్మానం చేయండి. అదే ఆదేశంగా చేసి ఈసీ ముందు పెట్టండి. లేదా ఈవీఎంల విషయంలో పూర్తిగా నమ్మండి. లేకపోతే ఓట్లేసిన జనాలకే కొత్త డౌట్లు వచ్చి ప్రజాస్వామ్యానికే ఇబ్బంది అవుతుంది అన్నది మేధావుల మాటగా ఉంది.

Tags:    

Similar News