తిరుమల పర్యటన రద్దుపై జగన్‌ ఏమన్నారంటే!

దీనిపై విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది.

Update: 2024-09-27 11:03 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన రద్దయింది. ఆయన ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది.

ఈ నేపథ్యంలో జగన్‌ తిరుమల పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 27 సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. రాత్రికి తిరుమలలోనే నిద్ర చేసి సెప్టెంబర్‌ 28న ఉదయం శ్రీవారిని దర్శించుకునేలా జగన్‌ ప్రోగ్రామ్‌ ఖరారైంది.

అయితే జగన్‌ తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదు అని నిప్పులు చెరిగారు.

జగన్‌ తిరుమల పర్యటనకు అనుమతి లేదని తమ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పించి తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్‌ అంశాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు అని జగన్‌ ఆరోపణలు గుప్పించారు.

జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తామన్నారు. టీటీడీలో 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదేనని గుర్తు చేశారు. తక్కువ రేటుకు కోట్‌ చేసిన వారికి టీటీడీ టెండర్‌ ఖరారు చేస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు.

నెయ్యి క్వాలిటీని చెక్‌ చేయించాకే వాహనాలు తిరుమలకు వస్తాయని జగన్‌ తెలిపారు. టీటీడీ కూడా క్వాలిటీ చెక్‌ చేస్తోందని చెప్పారు. పరీక్షలో విఫలమైన వాహనాలను వెనక్కి పంపడం సాధారణమన్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించారని గుర్తు చేశారు.

కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. టీటీడీ బోర్డు సభ్యులుగా తీసుకోవాలని కేంద్రం, సీఎంలు సిఫారసు చేస్తారని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యులు ప్రముఖులు.. పారదర్శకంగా పనిచేస్తారని జగన్‌ తెలిపారు.

కాగా జగన్‌ తిరుమల దర్శనానికి ముందు ఆయన నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తిరుమల దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారి దర్శనానికి వచ్చే ముందు తప్పనిసరిగా తమకు శ్రీవారిపై అచంచల విశ్వాసం ఉందని పేర్కొంటూ డిక్లరేషన్‌ పై సంతకం చేయాల్సి ఉందన్నారు.

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌ (టీటీడీ) అధికారులు సైతం జగన్‌ నుంచి డిక్లరేషన్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 24 వరకు తిరుపతిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ఆస్కారం లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు జగన్‌ తిరుమలకు వస్తే అడ్డుకోవడానికి పలు హిందూ సంఘాలు సైతం సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనవసరమైన గొడవలు, ఆందోళనలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే జగన్‌ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News