అక్కడా ప్రతిపక్ష నేత లేడు....అచ్చం ఏపీ లాగానే !
నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఫలితాలు వస్తాయని ఎవరికీ మెజారిటీ దక్కదని కూడా భావించారు.
దేశంలో అత్యంత ఉత్కంఠను కలిగించిన ఎన్నికలుగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలను చూడాలి. నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఫలితాలు వస్తాయని ఎవరికీ మెజారిటీ దక్కదని కూడా భావించారు.
ఇక గోడ దూకుళ్ళు కూడా ఉంటాయని కూడా అంతా ఊహించారు. కానీ జరిగింది వేరు. భారీ మెజారిటీ బీజేపీ నాయకత్వంలోని మహాయుతికి దక్కింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో 233 సీట్లను ఈ కూటమి గెలుచుకుంది. కేవలం 49 సీట్లతో మహా వికాస్ ఘాడీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఇపుడు మహా అసెంబ్లీలో బీజేపీ నాయకత్వంలోని కూటమి మొత్తం పరచుకుంది అన్న మాట.
మహారాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కాలీ అంటే 29 సీట్లు దక్కాలి. కానీ మహా వికాస్ ఆఘాడి కూటమిలో ఎవరికీ ఆ నంబర్ ని టచ్ చేసే విధంగా సీట్లు రాలేదు.
శివసేన 30 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ 13, ఎన్సీపీ 10 సీట్లు గెలుచుకున్నాయి. దాంతో విపక్ష నేత అన్న పదవి అక్కడ కూడా లేనట్లే. ఏపీలో చూస్తే వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అలా వైసీపీ విపక్ష నేత పదవికి దూరం అయింది.
ఇపుడు మహారాష్ట్రలో అదే కధ పునరావృత్తం అయింది. అన్నట్లు ఏపీలో టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తాయని చెప్పిన తెలుగు వారు అయిన కేకే సర్వే ఇపుడు మహా రాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీకి 220 దాటి వస్తాయని చెప్పారు. అదే చివరికి జరిగింది. దాంతో కేకే సర్వే కాదు కానీ ఓడిన పక్షానికి విపక్ష హోదా కూడా దక్కకుండా పోతోంది అని అంతున్నారు.
మరో వైపు చూస్తే కేవలం ఏపీ మహారాష్ట్ర లోనే కాదు గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం లలో కూడా ప్రతిపక్ష నేతలు లేరు. అంటే ప్రజాభిమానం వెల్లువలా మారి అధికార పార్టీలను అందలం ఎక్కిస్తూ భారీ ఆధిక్యతలు కట్టబెడుతున్నాయి.
ఇది మంచి పరిణామమేనా అంటే కాదు అనే అంటున్నారు. బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి. లేకపోతే పాలన ఏకపక్షం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా ఎంతో విలువ బాధ్యత ఉంటాయి. వారిని కూడా సమాదరిస్తేనే ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతుందని అంటున్నారు.