'ఓరెష్నిక్' క్షిపణికి భయపడుతున్న ఉక్రెయిన్.. ఎందుకు?
అమెరికా అండతో ఇటీవల ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడికి ప్రతిగా రష్యా ప్రయోగించిన క్షిపణి కొత్త చర్చకు తెరతీసింది.
వారాల్లో ముగిసిపోతుందని భావించిన రష్యా -ఉక్రెయిన్ యుద్ధం చూస్తుండగానే నెలలు దాటేసి.. రెండేళ్లకు పైనే కావొస్తుంది. విపరీతమైన ప్రాణ నష్టం.. కోలుకోలేనంత ఆస్తినష్టంతో పాటు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న సందేహంతో పాటు.. అమెరికాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యాకు ఒళ్లు మండి అణ్వస్త్ర క్షిపణిని ప్రయోగిస్తే తమ పరిస్థితేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అమెరికా అండతో ఇటీవల ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడికి ప్రతిగా రష్యా ప్రయోగించిన క్షిపణి కొత్త చర్చకు తెర తీసింది. అంతకంతకూ ముదురుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా తమపై ఖండాంతర క్షిపణితో దాడి చేసిందని ఉక్రెయిన్ చెబుతుంటే.. తాము అలాంటి పనేమీ చేయలేదని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇంతకూ ఉక్రెయిన్ అంతలా ఆందోళన చెందుతున్న ఓరెష్నిక్ క్షిపణి కథాకమామీషు లెక్కేంటి? దాని పవర్ ఏంటి? ఉక్రెయిన్ వణుకు వెనుకున్న కారణాలేంటి? అన్న వివరాల్లోకి వెళితే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఓరెష్నిక్ రష్యా డెవలప్ చేసిన ఖండాంతర క్షిపణి. అమెరికా.. బ్రిటన్ దేశాల అండతో ఉక్రెయిన్ చెలరేగిపోయి తమపై విరుచుకుపడితే.. దానికి బదులు తీర్చుకోవటానికి రూపొందించిన క్షిపణే ఓరెష్నిక్. రష్యాలో దొరికే హేజిల్ నట్ డ్రైఫ్రూట్ మొక్క పేరుతో ఈ క్షిపణికి ఓరెష్నిక్ పేరును పెట్టారు. ఈ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ స్థాయిలోకి వెళితే.. ధ్వని వేగం కంటే 10 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారణంగా ఈ క్షిపణిని ఒకసారి ప్రయోగించిన తర్వాత దాన్ని అడ్డుకోవటం అంత సులువైనది కాదని చెబుతారు. ఈ క్షిపణి సామర్థ్యం ప్రకారం చూస్తే.. 5 వేల కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాల్ని ఈ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. అంతేకాదు.. ఒకేసారి ఈ క్షిపణిని ప్రయోగించే వేళలో.. పలు లక్ష్యాల్ని ఛేదించేందుకు వీలుగా వీటికి వార్ హెడ్ లను డెవలప్ చేసినట్లుగా చెబుతారు.
ఒకే సమయంలో ఆరు నుంచి 8 వరకు న్యూక్లియర్ లేదంటే కన్వెన్షనల్ వార్ హెడ్ లను మోసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉందని చెబుతారు. రష్యా తమపై ప్రయోగించింది ఖండాంతర క్షిపణిగా ఉక్రెయిన్ వాదిస్తుందంటే.. అదేమీ కాదని.. రష్యా ప్రయోగించిన క్షిపణి మధ్యంతర శ్రేణి క్షిపణి కాదంటూ అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగించింది రూబెజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ గా పేర్కొంది. దీన్ని ప్రయోగించటానికి ముందే తమకు ఆ సమాచారం ఉందని అగ్రరాజ్యం పేర్కొంది. ఉక్రెయిన్ లోని పలు భాగాలు రష్యా సరిహద్దు నుంచి చాలా దగ్గరగా ఉన్న వేళలో.. ఖండాంతర క్షిపణులను ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? అంటూ రష్యా వాదిస్తోంది. ఏమైనా.. యుద్ధం తీవ్రతరం అయ్యే కొద్దీ.. యుద్ధ ముప్పు ఉక్రెయిన్ తో పాటు.. దాని మిత్రపక్షాలను వెంటాడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.