పిన్నెల్లి పొలిటికల్ కెరీర్ క్లోజ్ ?
ఆయన ఆవేశంతో చేసిన చర్యల ఫలితంగా ఎన్నికల రాజకీయాలకు అనర్హుడు అవుతారా అన్నది చర్చగా ముందుకు వస్తోంది.
వైసీపీకి చెందిన కీలక నాయకుడు మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్లేనా అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఆయన ఆవేశంతో చేసిన చర్యల ఫలితంగా ఎన్నికల రాజకీయాలకు అనర్హుడు అవుతారా అన్నది చర్చగా ముందుకు వస్తోంది. పిన్నెల్లి మీద ఏకంగా పది పదునైన సెక్షన్లతో కేసులు కట్టారు.
ఆయనను కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదని అంటున్నారు. దీంతో కౌంటింగ్ కి ముందే కటకటాల పాలు అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఆయన మీద పెట్టిన పది సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవిగా చెబుతున్నారు. వాటికి కనీసంగా ఏడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని అంటున్నారు.
అంటే ఆయన దాదాపుగా ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు అని కూడా చర్చ నడుస్తోంది. ఏదైనా కేసులలో ఇరుక్కుని జైలు పాలు అయి రెండేళ్ళకు మించి శిక్ష పడితే మాత్రం సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతారు. మరి పిన్నెల్లి విషయంలో ఏమి జరుగుతుంది అన్నది చర్చగా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పోలింగ్ బూత్ టీడీపీకి పూర్తిగా అనుకూలమైనది ఆ బూత్ లలో ఓట్లు వైసీపీకి ఎపుడూ పెద్దగా పడినది లేదు, అలాంటి చోట ఆయన క్షణికావేశంతో వీరంగం వేయడం వల్ల చివరికి ఆయన పదవికీ రాజకీయ జీవితానికి పెను ముప్పుగా మారుతున్నాయని అంటున్నారు.
ఎన్నికల సంఘం పెట్టే కేసులు సాధారణంగా తీవ్రంగా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు, ఆయనపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120 బి, ఆర్పీ చట్టంతో పాటు 131, 135సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ సీరియస్ సెక్షన్లే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయారు అని అంటున్నారు. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు అన్న అంచనాలు ఉన్నాయి. ఆయన తమకు ఓట్లు పెద్దగా పడని పోలింగ్ బూత్ లోకి ఎందుకు వెళ్ళారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన ఆవేశంతోనే ఇదంతా చేసారు అని చెబుతున్నారు.
అయితే ఏ విధంగా చేసినా పరిణామాలు తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే పిన్నెల్లి కేసుని కేంద్ర ఎన్నికల సంఘం క్లోజ్ గా మానిటరింగ్ చేస్తోంది. దీనిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఈవీఎంల ద్వంసం వంటి ఘటనలు దేశంలో జరిగి ఉన్నాయి. కానీ ఒక ఎమ్మెల్యే ఇలాంటి పనులు చేయడం మాత్రం ఎక్కడా చోటు చేసుకోలేదు. దాంతో ఈసీ మూడవ కన్ను తెరచింది. ఈ పరిణామాలు పూర్తిగా పిన్నెల్లి మెడకు ఉచ్చు బిగించినట్లుగానే ఉన్నాయని అంటున్నారు.
పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది. ఇంకో వైపు చూస్తే ఈసారి హోరా హోరీ పోరు సాగనుంది అని అంటున్నారు. వైసీపీకి టీడీపీ కూటమికి అయినా ప్రతీ ఒక్క సీటూ చాలా ఇంపార్టెంట్. అలాంటిది వైసీపీ కచ్చితంగా గెలిచే సీటు విషయంలో ఇలా జరగడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలో పడిపోతున్నాయి. ఏమి జరుగుతుంది అన్నది కూడా తెలియడం లేదు అని అంటున్నారు.