దౌత్య పాస్ పోర్ట్ తో దారి తప్పించారు ?
ఎన్నికలకు ముందు అతని సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకు వచ్చినా అతడు దేశం దాటి వెళ్లిపోయాడు.
ఒకటి కాదు రెండు కాదు మూడు వేలకు పైగా వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. అవి మామూలు వ్యక్తివి కాదు. ఒక ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి. దానికి తోడు అతను మాజీ ప్రధానికి మనవడు. ఒక రాజకీయ పార్టీ అధినేత కుమారుడి కుమారుడు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు ఉన్న అధినేత కుమారుడి కుమారుడు. ఎన్నికలకు ముందు అతని సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకు వచ్చినా అతడు దేశం దాటి వెళ్లిపోయాడు.
దేశ మాజీ ప్రధాని, కర్ణాటక హసన్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కలకలం రేపుతున్నది. అతను అసలు దేశం దాటి ఎలా వెళ్లాడు అన్న చర్చ జరుగుతున్నది. అయితే అతను దౌత్య పాస్ పోర్ట్ తో దేశం దాటి వెళ్లాడన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతున్నది.
దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారిక ప్రయాణాలు చేసే ఉద్యోగులు, ఐఎఫ్ఎస్, కేంద్రప్రభుత్వ విదేశీ వ్యవహారల ఉద్యోగులకు మాత్రమే ఈ పాస్ పోర్ట్ అందిస్తారు. పెద్దలకు ఇది పదేళ్లు, మైనర్లకు ఐదేళ్లు వర్తిస్తుంది. ఈ పాస్ పోర్ట్ కలిగిన వారికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రత్యేక ప్రయోజనాలు, దౌత్య పరమైన రక్షణలు ఉంటాయి.
ఈ పాస్ పోర్ట్ ఉన్న వారికి అనేక దేశాలు వీసా ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం మీద వేటు పడగానే ఈ పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు అంటే దీని ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. కేంద్రం అన్నీ తెలిసి ఈ పాస్ పోర్టు ఇచ్చి ప్రజ్వల్ ను సాగనంపిందా ? పరస్పర అవగాహనతో ఇది జరిగిందా ? అన్న అనుమానాలు తాజాగా మొలకెత్తుతున్నాయి.