డైనోసర్ లను కూడా పుట్టిస్తారా...జురాసిక్ పార్క్ నిజం అవ్వుతుందా?
సుమారు 10 వేల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి పూర్తిగా అంతరించిపోయిన 'డైర్ ఓల్ఫ్' జాతి తోడేళ్లను శాస్త్రవేత్తలు మళ్లీ సృష్టించారు.;

సుమారు 10 వేల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి పూర్తిగా అంతరించిపోయిన 'డైర్ ఓల్ఫ్' జాతి తోడేళ్లను శాస్త్రవేత్తలు మళ్లీ సృష్టించారు. 'కలోసల్ బయోసైన్సెస్' అనే సంస్థకు చెందిన పరిశోధకులు 72 వేల సంవత్సరాల నాటి శిలాజాలం నుంచి సేకరించిన డీఎన్ఏ (DNA)ను ఉపయోగించి మూడు డైర్ ఓల్ఫ్ కూనలను పుట్టించడంలో విజయం సాధించారు. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
డైర్ ఓల్ఫ్‌లు నేడు మనం చూస్తున్న సాధారణ తోడేళ్ల కంటే ఎన్నో రెట్లు పెద్దవిగా ఉండేవని, అంతేకాకుండా అవి చాలా క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి బలమైన దవడలు, పెద్ద శరీర పరిమాణం అప్పట్లో ఇతర జంతువులకు భయంకరమైన ముప్పుగా ఉండేవి.
అయితే, అంతరించిపోయిన ఒక భయంకరమైన జంతువును మళ్లీ సృష్టించడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పర్యావరణ వ్యవస్థలో ఈ కొత్త తోడేళ్లు ఎలా మనుగడ సాగిస్తాయో, ఇతర జంతువులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే విషయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం కలిగించవచ్చని వాదిస్తుంటే, మరికొందరు అంతరించిపోయిన జాతులను తిరిగి పుట్టించడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని అంటున్నారు. కొందరేమో డైనోసర్లను మళ్లీ పుట్టిస్తారా.. జురాసిక్ పార్క్ నిజం అవుతుందా అని ఈ వార్త తెలిసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, కలోసల్ బయోసైన్సెస్ పరిశోధకులు సాధించిన ఈ విజయం జీవశాస్త్రంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతోంది. భవిష్యత్తులో మరిన్ని అంతరించిపోయిన జాతులను తిరిగి పుట్టించేందుకు ఇది మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు పర్యావరణపరమైన చిక్కులను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.