కర్ణాటక : కిస్సా కుర్సీకా .. డీకె ప్లానేంటి ?!
అయితే విచారణకు అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముడా కుంభకోణం కలకలం రేపుతున్నది. సీఎం సిద్దరామయ్య మీద ఆరోపణల నేపథ్యంలో తన మీద గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణకు అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
అయితే సిద్దరామయ్యతో సీఎం పీఠం కోసం పోటీపడిన ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ కు ఆ పదవి ఖాయం అని అంతా అనుకుంటున్న తరుణంలో తెరమీదకు అనేకమంది పేర్లు వస్తున్నాయి. గంటగంటకూ అక్కడ ఆశావాహుల జాబితా పెరిగిపోతుంది. హోంమంత్రి పరమేశ్వరతో పాటు బీసీ కోటాలోొ మంత్రి సతీష్ జార్కి హోళీ పేరు తెర మీదకు వచ్చింది. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును కూడా కొంత మంది ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు.
ఇక వీరితో పాటు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్ ల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఎంబీ పాటిల్ పేరు రంగంలోకి రావడంతో ఆయనకు ఇప్పట్లో అవసరం లేదు. ఆయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు అంటూ శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.
ఈ పరిణమాలు ఇలా ఉండగా, సీఎం సీటుపై కీలకచర్చలు నడుస్తుండగా ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ ఆదివారం అమెరికా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో తాను ఇది వరకే సమాచారం ఇచ్చానని, ఈ మేరకు అమెరికా వెళ్తున్నాని, తిరిగి సెప్టెంబర్ 16న తిరిగి వస్తానని లేఖలో పేర్కొన్నాడు.
అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో డీకె అక్కడ మంత్రాంగం చేసేందుకే వెళ్తున్నట్లు భావిస్తున్నారు. అసలు డీకె వ్యూహం ఏంటి ? నేరుగా రాహుల్ తోనే తేల్చుకునేందుకు వెళ్లాడా ? అన్న విషయం తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.