అక్కడ పెంట్ హౌసే 190 కోట్ల.. ఇక్కడ పడిపోయిన ఇళ్ల అమ్మకాలు!

ఒక్కో ఫ్లాట్ సైజ్ 7,400 చదరపు అడుగుల నుంచి 16,290 చదరపు అడుగుల వరకు ఉంటుంది.;

Update: 2025-04-04 07:22 GMT
అక్కడ పెంట్ హౌసే 190 కోట్ల.. ఇక్కడ పడిపోయిన ఇళ్ల అమ్మకాలు!

గురుగ్రామ్‌లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఓ సంచలనం చోటుచేసుకుంది. డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో 16,290 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ అల్ట్రా-లగ్జరీ పెంట్‌హౌస్‌ను రిషి పార్తీ అనే టెక్ కంపెనీ యజమాని రూ.190 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ ధర వంద కోట్లతో ప్రారంభమవుతుంది. ఈ అపార్ట్‌మెంట్ అత్యంత లగ్జరీ నిర్మాణంగా పేరొందింది. గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై ఉన్న ఈ ప్రాజెక్ట్ డీఎల్‌ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌కు సమీపంలో ఉంది. 17.5 ఎకరాల విస్తీర్ణంలో 9 టవర్లు నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 429 యూనిట్లు ఉన్నాయి.

ఒక్కో ఫ్లాట్ సైజ్ 7,400 చదరపు అడుగుల నుంచి 16,290 చదరపు అడుగుల వరకు ఉంటుంది. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, గోల్ఫ్ కోర్స్ యాక్సెస్, 24/7 సెక్యూరిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది భారతదేశంలో మొట్టమొదటి LEED ప్లాటినం సర్టిఫైడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఫ్లాట్లు కొనుగోలు చేశారు.

మరోవైపు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం మందగమనంలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోగా, హైదరాబాద్‌లో మాత్రం గృహ విక్రయాలు ఏకంగా 47 శాతం మేర పడిపోయాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో హైదరాబాద్‌లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయని రియల్‌ ఎస్టేట్‌ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,835 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

కరోనా తర్వాత చాలా మంది సొంత ఇళ్ల కోసం ఆసక్తి చూపించారు. ఆ సమయంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొనుగోలు శక్తి ఉన్న వారంతా అప్పట్లోనే కొనేశారు. ఈ కారణంగా డిమాండ్ పడిపోయింది. రాను రాను ఇంకా పడిపోతోంది. తర్వాత వడ్డీరేట్లు పెంచడం, ఐటీ రంగంలో అనిశ్చితి, ఎన్నికలతో పాటు అనేక కారణాల వల్ల మళ్లీ ఇళ్ల అమ్మకాలు పుంజుకోవడం లేదు. అదే సమయంలో బిల్డర్లు చాలా వరకూ మధ్యతరగతికి దూరంగా వెళ్లిపోయి లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ కూడా గ్యాప్ వస్తుంది. పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో చూడాలి.

Tags:    

Similar News