అవును.. స్టూల్ బ్యాంకులు రాబోతున్నాయ్.. ఏం చేస్తారంటే?

తాజాగా నిర్వహించిన ఒక సదస్సు ముగింపులో భాగంగా ఈ కొత్త చికిత్సా పద్దతుల్ని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

Update: 2024-11-11 04:09 GMT

డబ్బులు దాచుకునే బ్యాంకులు.. పాలను దాచేవి.. చివరకు స్పెర్మ్ ను దాచే వాటి గురించి తెలిసిందే. ఇప్పుడు స్టూల్ (మలం) వంతు వచ్చింది. ఆరోగ్యవంతుల నుంచి సేకరించే మలాన్ని ఇందులో దాచి పెడతారు. విన్నంతనే వికారంగా అనిపించినా.. దీంతో జరిగే మేలు గురించి తెలిస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. ఈ కొత్త బ్యాంకుల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్..ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. తాజాగా నిర్వహించిన ఒక సదస్సు ముగింపులో భాగంగా ఈ కొత్త చికిత్సా పద్దతుల్ని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతకంతకూ పెరుగుతున్న సాంకేతికతో సరికొత్త చికిత్సా పద్దతుల్ని ఉపయోగించి వ్యాధుల్ని నయం చేసే విధానాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో స్టూల్ బ్యాంకు రానున్నట్లుగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పేరకొన్నారు. ఇంతకు ఆరోగ్యవంతుల మలంతో ఎలాంటి వ్యాధులకు చికిత్స చేస్తారన్న విషయంలోకి వెళితే.. జీర్ణ సంబంధిత వ్యాధులకు పరిష్కారాన్ని గుర్తించారు. మలం సంబంధిత ఫీకల్ మైక్రో బయోటా ప్లాంట్ థెరపీలు ముఖ్య పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా స్టూల్ బ్యాంకులు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారని చెప్పారు.

ఇంతకీ ఈ స్టూల్ బ్యాంకులతో ఏం చేస్తారు? అన్న విషయంలోకి వెళితే.. ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన స్టూల్ నమూనాల నుంచి గట్ మైక్రో బయోమ్స్ ను వేరు చేస్తారు. వాటిని రోగులకు మార్పిడి చేస్తారు. దీంతో జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తారు. ఈ థెరపీ ద్వారా ఇన్ ఫ్లమేటరీ బవెల్.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్.. క్లోస్ట్రిడ్యుడ్స్ డిఫిసిల్ ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులను స్టూల్ బ్యాంకుల నుంచి వేరు చేసే గట్ మైక్రో బయోమ్స్ తో నయం చేసే వీలుంది. అంటే.. రానున్న రోజుల్లో ఆరోగ్య వంతుల మలానికి డిమాండ్ ఏర్పడనుందన్న మాట.

Tags:    

Similar News