టీడీపీ మాస్టారుకు టైమ్ కలసిరావడంలేదా ?

పుష్కర కాలంగా ఆయన రాజకీయంగా ఇబ్బందులోనే ఉన్నారు పార్టీలు వరసబెట్టి మారుతూ వస్తున్నారు.

Update: 2025-01-06 04:23 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు రాజకీయంగా కాలం కలిసి రావడం లేదు. పుష్కర కాలంగా ఆయన రాజకీయంగా ఇబ్బందులోనే ఉన్నారు పార్టీలు వరసబెట్టి మారుతూ వస్తున్నారు. అయినా ప్రయోజనం అయితే కనిపించడం లేదు.

తన రాజకీయ వారసుడిని నిలబెట్టాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు సైతం పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఒక్క 2014 ఎన్నికల్లో మాత్రం ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చింది. అలా ఎన్నికల్లో పోటీ చేసి దాడి కుమారుడు ఓడారు. ఆ తరువాత ఆ పార్టీని వీడారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ వైపుగా చేరారు.

అయితే అక్కడ ఏమీ చాన్స్ లేకపోయేసరికి 2019లో మళ్లీ వైసీపీ వైపు వచ్చారు. అయిదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంది కానీ దాడికి ఎమ్మెల్సీ కోరిక తీరలేదు, కుమారుడికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దాంతో తిరిగి టీడీపీకి 2024 ఎన్నికల్లో వచ్చేశారు.

అయితే టీడీపీలో చేరినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా దాడి ఫ్యామిలీకి ఏ పదవీ అయితే ఇప్పటిదాకా దక్కలేదు. రెండు విడతలుగా నామినేటెడ్ పదవుల పందేరం సాగింది. అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీని మొదటి నుంచి కనిపెట్టుకుని ఉన్న నేత పీలా గోవింద సత్యనారాయణకు కీలకమైన నామినేటెడ్ పదవిని ఇచ్చారు. దాంతో మరో పదవి ఈ నియోజకవర్గానికి దక్కే చాన్స్ కనిపించడం లేదు.

ఇక ఎమ్మెల్సీ పదవుల పందేరంలో మాజీ ఎమ్మెల్యే బుద్ధ నాగ జగదీశ్వరరావుకు చాన్స్ ఉంది అని అంటున్నారు. ఆయన పట్ల టీడీపీ అధినాయకత్వానికి మంచి గురి మీద ఉంది. ఈ నేపథ్యం చూసినపుడు 2029 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద కుమారుడుకి టికెట్ దక్కవచ్చు అన్న ప్రచారం అయితే ఇప్పటి నుంచే వినిపిస్తోంది.

మరి దాడికి కానీ ఆయన వారసుడికి కానీ దక్కేదెమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. అయితే అధికార పార్టీలో వారు ఉండడమే ఒక సంతృప్తిగా చేసుకోవాలని అంటున్నారు. పార్టీలు వరసగా మారడం వల్ల సీనియర్ నేతగా ఉన్నా దాడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. టీడీపీలో ఆరు సార్లు ఎమ్మెల్యే టికెట్ ని సాధించి నాలుగు సార్లు గెలిచి మంత్రిగా అనేక శాఖలు దాడి చూశారు అలాగే ఎమ్మెల్సీగా ఒక పర్యాయం అధినాయకత్వం ఇచ్చిన చాన్స్ అందుకుని శాసనమండలిలో విపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ హోదాను అందుకున్నారు.

ఇలా పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీని వీడకుండా ఉండినట్లు అయితే దాడి కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఉండేదని అంటున్నారు. టీడీపీలో ఇపుడు అంతా కొత్త తరం వైపు చూస్తున్నారు విధేయతకు పెద్ద పీట వేస్తున్నారు. దాంతో పార్టీలు మారి వచ్చిన వారిని చేర్చుకున్నా పదవులు ఇవ్వడం అన్నది కష్టమే అని అంటున్నారు.

Tags:    

Similar News