ఎమ్మెల్సీ అనంతబాబు బ్యాగేజ్ అవసరమా ?

ఈ ఉదంతంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.

Update: 2024-01-05 05:08 GMT

నిజం ఏమిటన్న అంశాన్ని పక్కన పెడితే.. రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కొన్ని ఉదంతాలపై ప్రజల్లో ఒకలాంటి భావన ఉంటుంది. అదెంత చెప్పినా.. దానికి సంబంధించిన ముద్ర అలానే ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఆ కోవకు చెందినదే. తన దగ్గర పని చేసే డ్రైవర్ ను హత్య చేసి.. డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి మృతుడి ఫ్యామిలీకి అందజేసిన వైనం పెను సంచలనంగా మాత్రమే కాదు.. ఏపీ అధికార పార్టీకి తలనొప్పిగా మారటం తెలిసిందే. ఈ ఉదంతంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఇష్యూ అలానే ఉండిపోయింది.

అయితే.. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం సుదీర్ఘంగా చేసిన ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. బెయిల్ మీద విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబు.. జైలు నుంచి తిరిగి వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. చివరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్న కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో కూర్చొని.. అందరి నోట నానుతున్నారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి ఇంట్లో జరిగిన పార్టీ రివ్యూలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ఉందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఆనంతబాబు మీద నమోదైన సంచలన కేసు బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. 2022 మే 19 రాత్రి కాకినాడలోని 24 ఏళ్ల సుబ్రహ్మణ్యంను హత్య చేయటం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద అతను డ్రైవర్ గా పని చేస్తున్నాడు. హత్య చేసి అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నట్లుగా అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. రిమాండ్ రిపోర్టులోనూ ఇదే విషయాన్ని పోలీసులు పొందుపర్చారు.

అరెస్టు తర్వాత రిమాండ్ లో ఉన్న ఆయన.. పెద్ద ఎత్తున ప్రయత్నాల అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా.. హత్య నేరంలో ఆరోపణ లున్న ఎమ్మెల్సీ అనంతబాబు సభ్యత్వాన్ని రద్దు చేయాలని విపక్ష నేతలు గవర్నర్ ను కలిసి డిమాండ్ చేసినా.. ఆయన్ను తొలగించలేదు. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా 2022 మే 24న వైసీపీ ప్రకటించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతి రోజు నుంచే ఎమ్మెల్సీ అనంతబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్యకలాపాలన్ని ఆయనే చూసుకుంటున్నారు.

తాజాగా జనవరి 3న కాకినాడలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఆనంత బాబు పాల్గొన్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆయన వెన్నంటే ఉన్నారు. జనవరి 1 సందర్భంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయన్ను కలిసి పూల బొకేలు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వైసీపీ అధినాయకత్వం మీద ఉందంటున్నారు. ఒకవేళ.. అతడికి తగిన ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. అతడిపై విధించిన సస్పెన్షన్ వేటును తీసేయాలన్న మాట వినిపిస్తోంది. అనంతబాబు బ్యాగేజ్ విషయంపై పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మంచిదని.. కీలకమైన ఎన్నికల వేళ క్లారిటీ చాలా అవసరమంటున్నారు. మరి.. అధినేత ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News