మహా ఆశ్చర్యం.. అమెరికాలో 360 ఏళ్ల వ్యక్తి.. 2 కోట్ల మందికి 100 ఏళ్లు
వినగానే ఎవరికైనా కళ్లు తిరిగే.. చదవగానే నోరెళ్లబెట్టే ఈ విషయాలు డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషీయెన్సీ) టీమ్ పరిశీలన బయటపడ్డాయి.
భూమ్మీద ఒక వ్యక్తి ఎంత కాలం బతుకుతాడు..? జీవన ప్రమాణాలు మెరుగైన ప్రస్తుత పరిస్థితుల్లో 75 ఏళ్లు.. ఇక అమెరికా వంటి దేశాల్లో అయితే మరో ఐదేళ్లు అధికంగా జీవిస్తారు అనుకుందాం.. కానీ, అమెరికాలో ఓ వ్యక్తి 360 ఏళ్లు దాటినా సజీవంగా ఉన్నాడంటే నమ్మాల్సిందే..? అంతేకాదు 100 ఏళ్లు దాటినవారు 2 కోట్ల మంది వరకు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.. అక్కడి సోషల్ సెక్యూరిటీ విభాగం రికార్డులు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
వినగానే ఎవరికైనా కళ్లు తిరిగే.. చదవగానే నోరెళ్లబెట్టే ఈ విషయాలు డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషీయెన్సీ) టీమ్ పరిశీలన బయటపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు అయ్యాక డొనాల్డ్ ట్రంప్.. అపర కుబేరుడు స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సారథ్యంలో డోజ్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళన దీని లక్ష్యం.
ఇప్పుడు డోజ్ టీమ్.. సోషల్ సెక్యూరిటీ రికార్డులను తిరగేస్తోంది. ఇందులో వందల ఏళ్ల వయసున్నవారు ఇంకా బతికి ఉన్నట్లు తేలడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతోంది. వీరిలో 200 ఏళ్లు దాటినవారు 2 వేల మంది పైగా, 360-369 ఏళ్ల మధ్య వయసున్నవారు ఒకరున్నారట.
వందేళ్లు.. అయినా సోషల్ సెక్యూరిటీలో..
ఈ సంగతులను మస్క్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ట్విటర్లో వెల్లడించారు. అంతేకాదు.. వందేళ్లు దాటిన 2 కోట్ల మంది సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు మస్క్ తెలిపారు.
ఏమిటీ సోషల్ సెక్యూరిటీ?
మనదగ్గర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు అమెరికాలో మరో రూపమే సోషల్ సెక్యూరిటీ. అయితే, దీనిలోని అర్హుల జాబితా అమెరికా జనాభా కంటే అధికంగా ఉండడం గమనార్హం. అంటే.. భారత్ లో జనాభా కంటే రేషన్ కార్డులు అధికంగా ఉన్నట్లు అన్నమాట. దీంతో చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసమని పేర్కొన్నారు. 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ లో 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటినవారున్నట్లు గుర్తించారు. వారు ఆదాయం పొందడం లేదా.. ప్రయోజనాలను స్వీకరించడం కానీ, చేయడం లేదు. అయితే, ఆ జాబితాను సవరించలేదు.
అమెరికాలో 112 ఏళ్లున్నవారు 65 లక్షల మందికి సోషల్ సెక్యూరిటీ నంబర్లున్నాయి. వీరికి సంబంధించి ఎటువంటి డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయలేదు. వీరంతా ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే చనిపోయారు.
భూమ్మీద 35 మంది మాత్రమే ఈ వయస్సు దాటిన వారున్నారు. జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 100 ఏళ్లు దాటినవారు 86 వేలు మాత్రమే.
అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు చెందిన రిటైర్మెంట్, వైకల్యంతో బాధ పడేవారికి ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది.