అమెరికా అందుకే అగ్రరాజ్యం.. మనమూ నేర్చుకోవాలి నాయకా!
తాను ఏం చేయాలని అనుకుంటున్నారో.. ట్రంప్ చెప్పారు తప్ప.. ''దేశం నాశనం అయిపోయిందని, తాను బాగు చేస్తానని'' చెప్పలేదు. దేశాన్ని ముందుకు నడిపిస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు.
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు మారారు. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హోరా హోరీ పోరుకు తలపడిన రిపబ్లికన్ పార్టీ నేత, ఫైర్‌బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్ కనీవినీ ఎరుగని విజయాన్ని కైవసం చేసుకున్నారు. డెమొక్రాట్లకు బలమైన కంచుకోటలను కూడా కొల్లగొట్టారు. రాజకీయం ముగిసింది! అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. సోమవారం మధ్యాహ్నం 1.30(భారత కాల మానం ప్రకారం రాత్రి 10.40 గంటలు)కి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి 42 నిమిషాల పాటు ప్రసంగించారు. వాస్తవానికి ఫైర్ బ్రాండ్ ముద్రను ఆపాదించుకున్న ట్రంప్.. తన ప్రతి వాక్యంలోనూ నిప్పులు చెరుగుతారనే పేరు గడించారు.
అలాంటిది అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయనలో పక్కా మార్పు కనిపించింది. ఎంతగా అంటే.. ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రత్యర్థి నేతలు, తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు సైతం చప్పట్లు కొట్టేంతగా ఆయన తనప్రసంగాన్ని కొనసాగించారు. సహజంగా భారత్ వంటి అతి పెద్ద దేశాలను తీసుకుంటే.. అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజకీయాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. ఎన్నికల సమయంలోనే కాదు.. అధికారంలోకి వచ్చాక కూడా.. ప్రత్యర్థులపై నాయకులు నిప్పులు చెరుగుతారు. తూల నాడతారు. కానీ, ఈ తరహా రాజకీయాలు అమెరికాలో కనిపించలేదు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలానే అమెరికా ఈ విషయంలో ఆదర్శంగా ఉండడం గమనార్హం. అధికార పగ్గాలు చేపట్టక ముందు.. జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో నోరు చేసుకున్న ట్రంప్.. తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రసంగంలో ఎంతో మార్పును.. హుందాతనాన్ని చూపించారు. ఎక్కడా బైడెన్ ప్రభుత్వాన్ని కానీ, ఆయన పాలనను కానీ, వ్యక్తిగతంగా కానీ.. చిన్న మాట కూడా అనకపోవడం నిజంగా అగ్రరాజ్య రాజకీయాలను ఆలోచింపజేశాయి. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో.. ట్రంప్ చెప్పారు తప్ప.. ''దేశం నాశనం అయిపోయిందని, తాను బాగు చేస్తానని'' చెప్పలేదు. దేశాన్ని ముందుకు నడిపిస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు.
అదేసమయంలో బైడెన్‌పై ఒకప్పుడు వ్యక్తిగత విమర్శలతో చీల్చి చెండాడిన ట్రంప్.. తాజా ప్రసంగంలో బైడెన్‌ను పన్నెత్తు మాట అనలేదు. పైగా.. స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని.. చెప్పడం ద్వారా అమెరికన్ల మనసును కాదు.. ప్రత్యర్థుల మనసును కూడా ఆయన అమితంగా ఆకట్టుకున్నారు. వలసలు.. వివాదాలు.. యుద్ధాలు.. ఇలా.. అనేక అంశాలను ప్రస్తావించిన ట్రంప్.. గత పాలనపై వేలెత్తి చూపకపోవడం కూడా విశేషం. నిజానికి భారత రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ''ఇప్పుడు నా చూపు అభివృద్ది దిశగా నడుస్తుంది. అందరినీ ప్రేమిస్తా.. అందరినీ ఆదరిస్తా. కానీ, నేరస్తులను వదిలి పెట్టను'' అని ట్రంప్ వ్యాఖ్యానించినప్పుడు ప్రత్యర్థుల నుంచి కూడా చప్పట్లు మార్మోగడం గమనార్హం. అందుకే.. అమెరికా అగ్రరాజ్యంగా నిలిచిందని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.