బ్రిటన్ యువరాజును వదిలేస్తానంటూ తేల్చేసిన ట్రంప్

చేతులకు బేడీలు వేసి మరీ వారి స్వదేశాలకు పంపుతున్న ఆయన.. ఒక రాజకుటుంబ ప్రముఖుడి విషయంలో మాత్రం తాను ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని తేల్చేశారు.

Update: 2025-02-10 04:53 GMT

అందుకే అంటారు సంపన్నులు ఎప్పుడూ ఒక్కటేనని. న్యాయం అందరికి సమానంగా వర్తింపచేస్తానని చెప్పినప్పటికి.. పవర్ ఫుల్ పీపుల్ కు.. సామాన్యులకు మధ్య వ్యత్యాసం భూమికి.. ఆకాశానికి మధ్యనున్న దూరమంత ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంగతే చూడండి. తన దేశంలో అక్రమంగా ఉండే వారి విషయంలో ఎంత కఠినంగా ఉంటుందన్నది చూస్తున్నదే. అక్రమంగా తమ దేశంలో ఉన్నట్లు తేలినోళ్లను వారి దేశాలకు పంపేయటమే కాదు.. విమానంలోనూ కాళ్లకు.. చేతులకు బేడీలు వేసి మరీ వారి స్వదేశాలకు పంపుతున్న ఆయన.. ఒక రాజకుటుంబ ప్రముఖుడి విషయంలో మాత్రం తాను ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని తేల్చేశారు.

అమెరికాలో ఉంటున్న బ్రిటన్ యువరాజు హ్యారీ విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని.. ఆయన్ను అమెరికా నుంచి వెనక్కి పంపేయాలని అనుకోవటం లేదన్న ట్రంప్ నోటి నుంచి మరో ఆసక్తికర వ్యాఖ్య రావటం గమనార్హం. ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థల్లో ఒకటైన న్యూయార్క్ పోస్టు తాజా కథనం ప్రకారం.. ‘‘ప్రిన్స్ హ్యారీ విషయంలో నేను ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అతన్ని ఒంటరిగా వదిలేస్తున్నా. ఇప్పటికే భార్యతో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే హ్యారీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకోవటం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

నిజానికి హ్యారీకి సంబంధించిన అమెరికా వీసా మీద న్యాయపరమైన చిక్కులు చాలానే ఉన్నాయి. అమెరికా వీసా ప్రాసెస్ లో ఉన్న వేళలో హ్యారీపై చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ ను వినియోగించారనే ఆరోపణలురావటం తెలిసిందే. 2020లో రాయల్ డ్యూటీని వదులుకొని.. హాలీవుడ్ నటి మేఘన్ తో కలిసి ఉండేందుకు వీలుగా అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చేయటం తెలిసిందే.

బ్రిటన్ రాజు చార్లెస్ 3 చిన్న కొడుకైన ప్రిన్స్ హ్యారీ తన రాజరిక హోదాను వదులకొని మరీ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే.. మేఘన్ తో తాను అనుకున్న జీవితం లేకపోవటం.. వారిద్దరి మధ్య విభేదాలతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వీసా ఇష్యూ చర్చగా మారింది. దీనిపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇవ్వటంతో ఈ బ్రిటన్ యువరాజుకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలిపోయింది. ఏమైనా.. పవర్ ఫుల్ వ్యక్తులంతా ఒకే తాను గుడ్డలే. ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవటానికి పెద్దగా ఇష్టపడరన్న విషయం మరోసారి రుజువైందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News