ట్రంప్.. పెట్ట మీదే గెలుస్తాడా.. పుంజు మీద గెలవలేడా?

ఈ సమయంలో.. ఇటీవల కోడి పందేలు జరిగిన గోదావరి జిల్లాల్లో ట్రంప్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Update: 2025-01-23 05:26 GMT

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎటు చూసినా డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన వార్తలే, విషయాలే, విశేషాలే హల్ చల్ చేస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి వరకూ.. ఫ్లోరిడా నంచి వెస్ట్ గోదావరిలోని పాలకొల్లు వరకూ.. అలస్కా నుంచి అమలాపురం వరకూ ఎటు చూసినా ట్రంప్ కు సంబంధించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ సమయంలో.. ఇటీవల కోడి పందేలు జరిగిన గోదావరి జిల్లాల్లో ట్రంప్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసిన ఆయన.. రెండు సార్లు గెలిచారు. పైగా.. మిగిలిన అధ్యక్షులతో పోలిస్తే డొనాల్డ్ ట్రంప్ వైఖరి పూర్తి భిన్నం అనే కామెంట్లూ సొంతం చేసుకున్నారు. ఈ సమయంలో గోదావరి జిల్లాల్లో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అది ఏమిటీ.. కోడి పందేలకూ ట్రంప్ విజయాలకూ ఎలా లింక్ కలిపారనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్స్ కు ఆనందాలు, ప్రపంచ దేశాలకు టెన్షన్ వార్తలు షేర్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలుపుపై ఓ ఇంట్రస్టింగ్ చర్చ తెరపైకి వచ్చింది. అదే... ‘ట్రంప్ పెట్టమీదే గెలుస్తాడా.. పుంజు మీద గెలవడా’ అని!

వాస్తవానికి తొలిసారిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా 2016 నవంబర్ 8న జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగారు డొనాల్డ్ ట్రంప్. ఎవరూ ఊహించని రీతిలో బరిలోకి దిగిన ఆయన.. అతి తక్కువ ప్రచార సమయంలోనే రేసులో ముందుకు దూసుకొచ్చారు. అనంతరం... ప్రత్యర్థి, డెమోక్రాట్స్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు తొలుత ట్రంప్ అసలు పోటీనే కాదు అని భావించినవారు సైతం అవాక్కాయ్యారు!

ఈ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు 227 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. డొనాల్డ్ ట్రంప్ 304 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. దీంతో... హిల్లరీ క్లింటన్ పై విజయబావుటా ఎగురవేశారు. 2017 నుంచి 2021 వరకూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా తనదైన పాలన అందించారు!

అనంతరం 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ బరిలోకి దిగారు. అయితే.. ఈ సారి డెమోక్రాట్ల అభ్యర్థిగా జో బైడెన్ బరిలోకి దిగారు. చాలా మంది భావించినట్లుగానే ఈ ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ ఎన్నికల్లో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 232తో సరిపెట్టుకున్నారు. నాటి నుంచి ఈ ఏడాది జనవరి 19 వరకూ బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఇక తాజాగా 2024 నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ఫిమేల్ ప్రత్యర్థితో పోటీకి దిగారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా... డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారీస్ తో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ సత్తా చాటారు. ఇందులో భాగంగా... 312 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ సాధించగా, కమలా హారిస్ కు 226 ఓట్లు దక్కాయి.

కట్ చేస్తే... ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతా అన్నట్లుగా ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు సందడి చేశాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా... డేగ, సేతు, సవల, పింగళ, కాకి, కొక్కిరాయి మొదలైన రకాల కోళ్లు బరుల్లో దుమ్ము లేపాయి.. కొంతమందికి కాసుల పంట పడించాయి.

ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగా.. అందులో రెండు సార్లు మహిళా అభ్యర్థులతోనూ, ఒక్కసారి పురుష అభ్యర్థితోనూ బరిలోకి దిగారు. అయితే... అనూహ్యంగా పురుష అభ్యర్థి (జో బైడెన్) పై ఓటమి పాలైన ట్రంప్, మహిళా అభ్యర్థులు (హిల్లరీ క్లింటన్, కమలా హారిస్)పై మాత్రం విజయం సాధించారు.

ఈ నేపథ్యంలోనే ఇంకా కోడి పందేళ హ్యాంగోవర్ నుంచి బయట పడని పలువురు గోదావరి జిల్లా జనాలు.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రాజకీయ కెరీర్ పై ఇలా "పెట్ట మీదే గెలుస్తాడా.. పుంజు మీద గెలవలేడా" అనే చర్చను తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో... పైకి వెటకారంగా అనిపించినా... ఇదీ ఒక పాయింటే కదా అనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News