వలసదారులపై ట్రంప్ కు పీకలదాకా ఉందా?... తెరపైకి సంచలన పిలుపు?
వాస్తవానికి అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు ఇప్పటికె మరణశిక్షను నిషేధించాయి.
నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ వ్యవహరం అత్యంత కీలక అంశాల్లో ఒకటిగా ఉండబోతుందనే సంగతి తెలిసిందే! ఈ విషయంలో ట్రంప్ తన దూకుడుని కొనసాగిస్తూ వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అరోరాలో జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అలానే ఉన్నాయి.
అవును... కొలరాడోలోని అరోరారో జరిగిన ర్యాలీలో వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా.. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక వ్యాక్చాతుర్యాన్ని పెంచుతున్న క్రమంలో... యూఎస్ పౌరులను చంపే వలసదారులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు.
వాస్తవానికి అమెరికాలో చట్టవిరుద్ధమైన ఇమ్మిగ్రేషన్ అనేది ఓటరు ప్రధాన ఆందోళన కాగా.. దాన్ని పరిష్కరించగల ఉత్తమ వ్యక్తిగా చాలా మంది ఓటర్లు ట్రంప్ ని చూస్తుంటారనే విషయాన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయని అంటారు. దీంతో... ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక మాటలను మరింత కఠినతరం చేస్తున్నారు ట్రంప్!
మహిళలు, పిల్లల అక్రమ రావాణాకు పాల్పడిన వ్యక్తులకు మరణశిక్ష విధించాలని ఇప్పటికే ప్రతిపాదించిన ట్రంప్.. తాజాగా అమెరికన్ పౌరుడిని చంపే ఏ వలసదారునికైనా మరణశిక్ష విధించాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు బిగ్గరగా అనుకూల నినాదాలూ చేయడం గమనార్హం.
వాస్తవానికి అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు ఇప్పటికె మరణశిక్షను నిషేధించాయి. ఇదే సమయంలో.. స్థానికంగా జన్మించిన అమెరికన్ల కంటే వలసదారులు అధిక స్థాయిలో నేరాలు చేయరని పలు అధ్యయనాలు చూపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా "వలస నేరం" అని పిలిచే వాటిపై ట్రంప్ ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది!