డీప్ సీక్ దెబ్బకు రూ.51 లక్షల కోట్లు ఆవిరి.. ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు!

అవును... డీప్ సీక్ సంస్థ ఇటీవల ఆర్1 పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మిగిలినవాటిలా కాకుండా ఇది పూర్తిగా ఉచితం కావడంతో ఇది ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది.

Update: 2025-01-28 16:30 GMT

చైనాకు చెందిన డీప్ సీక్ స్టార్టప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... అతి తక్కువ ఖర్చుతో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను ఆవిష్కరించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియాకు బిగ్ షాక్ తగిలింది.

అవును... డీప్ సీక్ సంస్థ ఇటీవల ఆర్1 పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మిగిలినవాటిలా కాకుండా ఇది పూర్తిగా ఉచితం కావడంతో ఇది ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దీనికి యూజర్ల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే సమయలో అమెరికా టెక్ ఇండస్ట్రీపైనా పెను ప్రభావం చూపిస్తోంది.

డీప్ సీక్ దెబ్బకు ప్రధానంగా ఎన్విడియా భారీ నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియాతో పోలిస్తే తాము చాలా తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే ఏఐ మోడల్స్ ని రూపొందించామని చెప్పడంతో మార్కెట్ లో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో.. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం నాటి మార్కెట్ లో సుమారు 17శాతం షేర్లు కుంగిపోయాయి.

ఫలితంగా... ఎన్విడియా మార్కెట్ విలువలో $593 బిలియన్ల సంపద ఆవిరైంది. అంటే... భారత కరెన్సీలో అక్షరాలా రూ. 51 లక్షల కోట్లన్నమాట. ఇదే సమయంలో... అటు మైక్రోసాఫ్ట్, మెటా షేర్లు కూడా నష్టపోయాయి. ఈ సందర్భంగా స్పందిస్తున్న నిపుణులు.. షేర్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నష్టం అని చెబుతున్నారు.

మరోపక్క ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా.. డీప్ సీక్ ఏఐ.. మన పరిశ్రమలకు ఓ మేలుకొలుపుగా భావించాలని.. ఈ పరిణామాన్ని మనం సానుకూల దృక్పథంతో చూడాలని.. మనం కూడా తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతను తీసుకొచ్చేలా ఆలోచించాలని.. గెలవడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

కాగా... ఈ ఏఐ ఆర్1 చాట్ బాట్ ను వినియోగించాలనుకునేవారు.. చాట్.డీప్ సిక్.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి, ఇ-మెయిల్ ఐడీతో లాగిన్ అయితే సరిపోతుంది! వెంటనే డాల్ఫిన్ లోగోతో కూడిన చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇంటర్ ఫేస్ పరంగా అచ్చం చాట్ జీపీటీని పోలి ఉండే దీనిలో తెలుగులోనూ చాట్ చేయొచ్చు!

Tags:    

Similar News