నేను గెలిస్తే మీ గన్స్ మీద ఎవరూ వేలు పెట్టరన్న ట్రంప్

ఏదైనా విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఎంతటి క్లారిటీతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-02-11 06:42 GMT

ఏదైనా విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఎంతటి క్లారిటీతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ‘ఔను’ అనుకున్న విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు అస్సలు తగ్గరు. ఎవరెన్ని చెప్పినా.. మరెన్ని విమర్శలు వచ్చినా తాను అనుకున్నది చేసే వరకు వదలని మొండితనం ఆయన సొంతం. అలాంటి ట్రంప్ తాజాగా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ ఏ)కు భారీ హామీని ఇచ్చేశారు.

తాను కానీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎన్ఆర్ ఏ సభ్యులు వినియోగించే గన్స్ పై ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చేశారు. ‘‘నవంబరు నెలలో జరిగే ఎన్నికల్లో నేను విజయం సాధిస్తే.. మీ గన్స్ మీద ఎవరూ వేలు కూడా పెట్టలేరు’’ అంటూ కచ్ఛితమైన హామీని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వారికి అలాంటి హామీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే.. కాస్తంత వెనక్కి వెళ్లాలి.

ఎన్ఆర్ఏ సంస్థకు సీఈవోగా వేన్ లా పియెర్ దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయనపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు పెద్ద ఎత్తున రావటంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రైవేటు విమానాలు.. విలాసవంతమైన బోట్లలో తిరిగేందుకు.. ఆఫ్రికాలో జంతువల వేటకు.. ఇతరత్రా విలాసవంతమైన పనులకు సంస్థకు చెందిన నిధులు దుబారా చేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ సంస్థ దివాలా పిటిషన్ ను కోర్టులో వేశారు.

అంతేకాదు.. తమ కార్యాలయాన్ని న్యూయార్క్ నుంచి టెక్సాస్ కు మార్చుకోవటానికి అనుమతించాలని కోర్టును కోరారు. అయితే.. అందుకు న్యాయస్థానం నో చెప్పింది. అయితే.. ఆయుధాలు కలిగి ఉండటం తమకు రాజ్యాంగపరమైన హక్కుగా అమెరికా జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీలో ఈ సంస్థకు చెందిన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్లకు తనది పూచీకత్తుగా ట్రంప్ తాజా హామీని ఇచ్చారని చెప్పాలి.

Tags:    

Similar News