అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం ఇదే

అమెరికన్లను సంపన్నులుగా మార్చటమే లక్ష్యం. పలు దేశాలపై సుంకాలు.. ఇతర టారిఫ్ లు పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం.

Update: 2025-01-21 04:01 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే సంచలనాలు ఉంటాయన్న విషయాన్ని మొదట్నించి చెబుతూనే ఉన్నారు. అక్రమ వలసల విషయంలో కఠినంగా ఉంటానని.. అమెరికాను అన్నింట్లోనూ ఫస్ట్ చేయటమే తన లక్ష్యంగా పేర్కొనటం తెలిసిందే. తాను అధ్యక్ష పదవిని చేపట్టినంతనే సంచలనాలకు కొదవ ఉండదన్న మాటలకు తగ్గట్లే.. ఆయన చేతలు ఉన్నాయి. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్.. ఆ వెంటనే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వ ఎజెండా ఏమిటన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీపై తీవ్ర విమర్శలు చేయటానికి వెనుకాడలేదు. ప్రమాణస్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలోనే దేశ అధ్యక్షుడి హోదాలో విపక్ష డెమొక్రాట్లపై నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందన్న ట్రంప్.. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలమైన తీర్పు ఇచ్చారన్నారు.

అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ తన తొలి ప్రసంగాన్ని అరగంట పాటు చేశారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంట పుట్టే వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు. అందరిని ఆకట్టుకునేలా తన ప్రసంగం ఉండకుండా తాను ఏం చేయాలనుకుంటున్నాను.. ఏం చేస్తానన్న విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడిందన్న ట్రంప్..

‘‘స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తు అంతా మనదే. మన దేశం నేటి నుంచి అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తివంతమైన.. గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశం అబ్బురపడేలా.. ఆసూయ చెందేలా.. అభినందించేలా డెవలప్ అవుతుంది. అన్ని విషయాల్లోనూ అమెరికానే ఫస్ట్ అన్నదే మా నినాదం. అదే మన మూలమంత్రం’ అంటూ తన మనసులోని మాటల్ని బలమైన పదాలతో చెప్పేశారు 78 ఏళ్ల ట్రంప్.

దేశాధ్యక్షుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ నమ్మకాన్ని.. మీ సంపదను.. ప్రాస్వామ్యాన్ని.. స్వేచ్ఛను మీకు తిరిగి ఇస్తా. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాం. అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోంది. వారు అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. వర్తక వ్యవస్థను సమైూలంగా మారుస్తాం.

అమెరికన్లను సంపన్నులుగా మార్చటమే లక్ష్యం. పలు దేశాలపై సుంకాలు.. ఇతర టారిఫ్ లు పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్స్ కార్టల్స్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి.. వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుంది’’ అంటూ పలు సంచలన.. వివాదాస్పద వ్యాఖ్యల్ని చేశారు.

బైడెన్ నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగిన ట్రంప్.. ‘‘లాస్ ఏంజెలెస్ మంటలు వంటి మామూలు సమస్యలను కూడా బైడెన్ సర్కారు పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు. డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా.. హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది. న్యాయవ్యవస్థకు సంకెల్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుదున్న ధరలకు.. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.

250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చానని.. అందుకే దేవుడు అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకు తనను హత్యయత్నం నుంచి కాపాడాడేమోనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల సందర్భంగా రిపబ్లికన్లు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అదే సమయంలో ఆయన ప్రసంగాన్ని అధ్యక్షుడు బైడెన్.. ఉపాధ్యక్షురాలు హరిస్ మైనంగా చూస్తూ ఉండిపోయారు. జనవరి 20.. హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ దినమన్న ట్రంప్.. అమెరికా కోసం ఆయన కన్న కలల్ని సాకారం చేసి చూపిస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News