చలమలశెట్టి... ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ నా ?

అది నిజమే అనిపించేలా ఆయన ఒకటి రెండూ కాదు నాలుగు సార్లు ఓటమి పాలు అయ్యారు. ఒకటే నియోజకవరం, పార్టీ మాత్రం వేరు.

Update: 2024-06-07 03:51 GMT

ఆయన ఇంటి పేరు చలమలశెట్టి ఒంటి పేరు సునీల్. టాలెంట్ నిండా ఉన్నవారే. మంచి బిజినెస్ మాన్. కానీ పాలిటిక్స్ లోనే ఆయన జాతకం అడ్డంగా తిరగబడుతోంది అని అంటున్నారు. అది నిజమే అనిపించేలా ఆయన ఒకటి రెండూ కాదు నాలుగు సార్లు ఓటమి పాలు అయ్యారు. ఒకటే నియోజకవరం, పార్టీ మాత్రం వేరు. ఓటమి మాత్రం కామన్. ఆయనతో పాటు ఆయన పార్టీ సైతం ఓడిపోవడం కూడా కామన్. ఇదంతా గత పదిహేనేళ్ళుగా సాగుతున్న ఒక రాజకీయ చరిత్ర.

కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ ఓటమి పాలు అవుతుంది అన్నది ఒక చరిత్ర. అది నిజమే అనిపించేలా జరుగుతోంది. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన చలమలశెట్టి ప్రజారాజ్యం తరఫున తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగితే తొలి ఓటమి అలా పలకరించింది. ప్రజారాజ్యం కూడా ప్రతిపక్షంలోకి వచ్చింది.

ఇక 2014 నాటికి అదే చలమలశెట్టి వైసీపీ నుంచి కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఓడారు, పార్టీ ఓడింది. వైసీపీ అపోజిషన్ లోకి వచ్చింది. ఇక 2019లో చలమలశెట్టి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున వంగా గీత గెలిచారు. ఆయన ఓటమి పాలు అయ్యారు. ఏపీలో టీడీపీ కూడా ఓడింది.

ఇక 2024 ఎన్నికల్లో చూస్తే వైసీపీ నుంచి చలమలశెట్టి పోటీ చేస్తే భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆయనతో పాటు వైసీపీ కూడా నిండా మునిగింది. దీనిని చూసిన వారు అంతా ఇదేమి మహిమ చలమలశెట్టి అని అంటున్నారుట.

అంతే కాదు మరో మాట కూడా అంటున్నారుట. చలమలశెట్టి వెళ్ళిన పార్టీ ఓడుతుందా లేక ఆయన పోటీ చేయడానికి ఓటమి రాసిపెట్టుకున్న పార్టీలోకి కోరి మరీ వెళ్తారా అన్న చర్చ సాగుతోంది. ఏమైతేనేమి ఎంతో మంది కాకినాడ నుంచి ఎంపీలు అయ్యారు. కానీ పాపం నాలుగు సార్లు పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా పోటీ చేస్తూ వస్తున్న చలమలశెట్టికి మాత్రం గెలుపునకు దారేదీ అన్న ప్రశ్నే ఎదురవుతోంది.

ఇక ఆయన 2029లో పోటీ చేస్తారా చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తారు అన్న చర్చ కూడా ఇప్పటి నుంచే సాగడం విశేషం. ఈసారి చలమలశెట్టిని తమ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి గెలిపించి తాము కూడా గెలిచే మొనగత్తె పార్టీ ఏపీలో ఏదో చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News