రాష్ట్రపతి నోట.. సర్కారు గొప్పలు.. సభలో ప్రసంగం
గత ఏడాది సాధించిన విజయాలు అంటూ ప్రారంభించి.. అనేక విషయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. నూతన పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఆమె తన ప్రసంగంతో ప్రారంభించారు. నేటి నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సభలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలావుంటే.. రాష్ట్రపతి ముర్ము మాట్లాడిన ప్రసంగంలో అడుగడుగునా ప్రధాని మోడీ సహ ఆయన నేతృత్వంలోని ప్రభు త్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
గత ఏడాది సాధించిన విజయాలు అంటూ ప్రారంభించి.. అనేక విషయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. చంద్రుడిపై ఇస్రో చేపట్టిన ప్రయోగం.. నుంచి గత ఏడాది ప్రారంభించిన కొత్త రైలు నమో భారత్ వరకు.. రాష్ట్రపతి ప్రశంసలతో ముంచెత్తారు. ''గరీబీ హఠావో అనేది ఒకప్పుడు నినాదంగానే ఉండేది. కానీ, మా సర్కారు నిజం చేసింది. దేశంలో పేదలకు అన్ని విధాలా మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని పేదరికం నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తోంది'' అని రాష్ట్రపతి అన్నారు. ఈ పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం'ను తీసుకువచ్చా మ ని రాష్ట్రపతి తెలిపారు. అద్భుతమైన రామమందిరాన్ని నిర్మించుకున్నామన్న రాష్ట్రపతి.. అయోధ్య లో ఒక చరిత్రను లిఖించినట్టు చెప్పారు. దేశంలో 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తోందని తెలిపారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రబుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పరస్పర గౌరవం, వ్యక్తీకరణ.. వంటివి రాజ్యాంగం కల్పించిన హక్కులుగా ఆమె పేర్కొన్నారు.
అయితే.. రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, ధరలు, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితు లు మచ్చుకు కూడా కనిపించ లేదు. వినిపించలేదు. అదేసమయంలో నిరుద్యోగం వంటి కీలకమైన అంశాలను కూడా వదిలేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కేవలం మోడీని ప్రశంసించేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన కార్యక్రమని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం.