80 లక్షల డ్రైవర్ ఉద్యోగాలు పోతాయి...కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా... "భారత్‌ లో డ్రైవర్‌ లేని కార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని గతంలో యూఎస్ లోనే చెప్పాను

Update: 2023-12-18 18:34 GMT

దేశంలో చాలా మంది డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చాలా మంది హెవీ వెహికల్స్ డ్రైవర్స్ గా ఉండగా.. మరికొంతమంది క్యాబ్ లని, సొంత అద్దె కార్లని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో చాలామంది వారి వారి యజమానుల వద్ద డ్రైవర్లుగా ఉంటున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో సుమారు 80 లక్షల డ్రైవర్ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

అవును... డ్రైవర్ లెస్ కార్లను దేశంలోకి తీసుకువస్తే. సుమారు 80 లక్షల మంది డ్రైవర్లు నిరుద్యోగులుగా మిగిలిపోతారని.. అందువల్ల భారతదేశంలో డ్రైవర్‌ లేని కార్లను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. మరోసారి అదే అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా డ్రైవర్ లెస్ కార్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం వెనుక చాలా ప్రజా ప్రయోజనం ఉందని తెలిపారు.

ఇందులో భాగంగా... "భారత్‌ లో డ్రైవర్‌ లేని కార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని గతంలో యూఎస్ లోనే చెప్పాను. ఎందుకంటే.. మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. డ్రైవరు లేని కార్లు వారి ఉద్యోగాలను కొల్లగొడతాయి" అని గడ్కరీ వెల్లడించారు. ఇదే సమయంలో డ్రైవర్ లెస్ కార్లు ఇండియా వంటి అధిక జనాభా ఉన్న దేశాల్లోకి వస్తే ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు.

ఈ క్రమంలో... ఇటువంటి వాహనాలు తక్కువ జనాభా ఉన్న దేశాలకు మాత్రమే సరిపోతాయని తెలిపిన గడ్కరీ... డ్రైవర్ లెస్ కార్లు ఇండియాకు వస్తే.. సుమారు 70-80 లక్షల మంది ప్రజలు తమ డ్రైవింగ్ ఉద్యోగాలను కోల్పోతారని తెలిపారు. తాజాగా ఐఐఎం - నాగ్‌ పూర్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ ల ఏర్పాటు.. రోడ్లపై బ్లాక్ స్పాట్‌ ల తొలగింపు వంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక ఫ్రేం వర్క్‌ ను రూపొందించామని తెలిపిన కేంద్రమంత్రి గడ్కరీ... ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రోజన్‌ ను భవిష్యత్తు ఇంధనంగా నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు.

కాగా... ఇప్పటికే రెండు సార్లు డ్రైవర్ లెస్ కార్లపై నితిన్ గడ్కరీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో డ్రైవర్‌ లెస్ కార్లకు ప్రవేశం లేదంటూ జూలై 2017, డిసెంబర్ 2019లో వెల్లడించారు. దీనివల్ల డ్రైవర్ ఉద్యోగాలు పోతాయని తెలిపారు!

Tags:    

Similar News