సాయానికి సాంకేతిక‌ సొబ‌గు.. వినూత్న ప్ర‌య‌త్నం!

ఈ క్ర‌మంలోనే రాత్రికి రాత్రి 5 ల‌క్ష‌ల మందికి స‌రిపోయేలా ఆహారం త‌యారు చేయించారు.

Update: 2024-09-03 05:05 GMT

పీక‌ల్లోతు నీళ్లు.. ఎటు చూసినా దారి తెన్ను క‌నిపించ‌ని ప‌రిస్థితి. పోనీ.. వ‌దిలేద్దామంటే.. అటు వైపు వంద‌లాది మంది నిస్స హాయ స్థితిలో వ‌ర‌దలో చిక్కుకుని విల‌పిస్తున్న తీరు.. వెర‌సి.. ఏపీ స‌ర్కారుకు ప్ర‌స్తుతం ఎదురైన సంక‌ట స్థితి గ‌తంలో ఎప్పు డూ రానిది. దీనిని ఎదుర్కొని సాయం చేసే క్రమంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. క‌నీసం ప‌డ‌వ‌లు కూడా వెళ్లేందుకు అవ‌కాశం లేనంత‌గా వ‌ర‌ద విజృంభించింది. కాల‌నీల‌కు కాల‌నీలే మునిగిపోయాయి. ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. దీంతో వారికి క‌నీసంలో క‌నీసం.. ఆహార‌పొట్లాలైనా అందించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఉద్దేశం.

ఈ క్ర‌మంలోనే రాత్రికి రాత్రి 5 ల‌క్ష‌ల మందికి స‌రిపోయేలా ఆహారం త‌యారు చేయించారు. వాట‌ర్ బాటిళ్లూ సిద్ధం చేశారు. కానీ.. ల‌క్ష్యం నెర‌వేర‌లేదు. క‌నీసం స‌గం మంది ఆక‌లి కూడా తీర్చ‌లేక పోయారు. దీంతో ఆహారం వృధా అయిపోయింది. శ్రమ కూడా ఫ‌లించ‌లేదు. దీనికి కార‌ణం.. నిలువెత్తు నీళ్ల‌లో వెళ్లి ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌క‌పోవ‌డ‌మే. పైగా.. సాహ‌సించేందుకు ముందుకు వ‌చ్చినా.. వారికి ఎలాంటి ఆప‌ద వ‌స్తుందోన‌న్న భ‌యం మ‌రోవైపు స‌ర్కారును వెంటాడింది. దీంతో చంద్రబాబు వినూత్న ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం హెలికాప్ట‌ర్ల ద్వారానే.. సాయం అందించే ప‌రిస్థితికి ఆయ‌న స‌రికొత్త మార్గం చూపించారు.

అదే.. డ్రోన్‌! దీని సాయంతో ఆహార ప‌దార్థాలు అందించే ప్ర‌క్రియ‌ను ప్రాథ‌మికంగా విజ‌య‌వాడ‌లో ప‌రిశీలించారు. సుమారు 30 కిలోల బ‌రువు ఉన్న ఆహార పొట్లాల బ‌స్తాను ఒక డ్రోన్‌కు ఏర్పాటు చేసి.. దానిని సమీపంలోని ఓ అపార్ట్‌మెంటు వాసుల‌కు పంపించారు. సుమారు 200 అడుగుల మేర‌కు ఎగిరిన డ్రోన్ ల‌క్ష్యం మేర‌కు అపార్ట్‌మెంటును చేరుకుని.. బాధితుల‌కు ఆహార ప‌దార్థాల‌ను అందించింది. దీంతో మంగ‌ళ‌వారం నుంచి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో డ్రోన్‌ను వినియోగించాలని.. అధికారుల‌కు చంద్ర‌బాబు సూచించారు. అయితే.. స‌హాయ సిబ్బంది వెళ్లి ఇవ్వ‌గ‌లిగే ప్రాంతాల్లో కాకుండా.. సుదూర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సాయం చేసేందుకు డ్రోన్ ను వినియోగించాల‌ని.. అవ‌స‌ర‌మైతే... మ‌రిన్ని డ్రోన్లు తెప్పించాల‌ని కూడా ఆదేశించారు. దీంతో్ సాయంలో సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట ప‌డింది.

Tags:    

Similar News