పెళ్లి కూతురు ఫ్రెండ్ మెడలో వరుడి వరమాల.. రణరంగంగా మండపం!

తాను అడిగిన అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో.. ఓ వరుడు కోపం తెచ్చుకున్నాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయి కుటుంబ పరువు తీయాలనుకున్నాడు.

Update: 2025-02-26 15:17 GMT

తాను అడిగిన అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో.. ఓ వరుడు కోపం తెచ్చుకున్నాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయి కుటుంబ పరువు తీయాలనుకున్నాడు. ఈ సమయంలో స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. పెళ్లిరోజే పీటలపైకి తాగి వచ్చాడు.. ఈ సమయంలో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని బరేలికి చెందిన రవీంద్ర కుమార్ కి రాధాదేవితో ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఊరేగింపుతో వరుడు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే.. అప్పటికే ఇరు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే... వధువు కుటుంబాన్ని అందరి ముందు ఎలాగైనా అవమానించాలని వరుడు రవీంద్ర కుమార్ ఫిక్సయ్యాడు. ఈ క్రమంలో... ఊరేగింపుకు ముందే ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా మద్యం సేవించాడు. అనంతరం.. కల్యాణ మండపానికి చేరుకున్నాడు. మండపంలో పెళ్లి తంతు మొదలైంది.. అంతా వివాహ కార్యక్రమానికి చూస్తున్నారు.

ఈ సమయంలో వధువు మెడలో వరమాల వేయాల్సి ఉండగా.. పక్కనున్న ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో... అంతా ఒక్కసారిగా షాకయ్యారు. మరోపక్క వరుడు చేసిన పనితో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తూగుతూ ఊగుతూ ఉన్న వరుడిని లాగి చెంప మీద కొట్టింది. అనంతరం తన చేతిలో ఉన్న దండ నేలకేసి కొట్టి, అక్కడ నుంచి వెళ్లిపోయింది.

అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన పరిస్థితి. ఈ సమయంలో.. అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగప్రవేశం చేసిన పోలీసులు వరుడితో పాటు అతడి స్నేహితులపైనా కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News