ఐపీఎల్ సరే.. మీకు డీపీఎల్ తెలుసా? అందులోనూ అగ్ర క్రికెటర్లు..
ప్రపంచంలోని క్రికెట్ లీగ్ లు అన్నిట్లోకి ఖరీదైనది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచం నలుమూలలా లీగ్ లు జరుగుతుండొచ్చు
ప్రపంచంలోని క్రికెట్ లీగ్ లు అన్నిట్లోకి ఖరీదైనది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచం నలుమూలలా లీగ్ లు జరుగుతుండొచ్చు.. కానీ భారత్ లోని లీగ్ కే అత్యంత క్రేజ్. ఇక్కడి మైదానాలు, నిర్వహణ తీరు, పోటీతత్వం, అంతర్జాతీయ ఆటగాళ్లు తలపడడం, దేశవాళీ ప్రతిభ తదితరాలు ఇందుకు కారణం.. ఐపీఎల్ ను 16 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. అయినా క్రేజ్ తగ్గడం లేదు. కానీ, మరి మీకు ఇలాంటిదే ఇండియాలో మరో లీగ్ ఉందని తెలుసా?
ఐపీఎల్ 17వ సీజన్ మరెంతో దూరంలో లేదు. సరిగ్గా 22 రోజుల్లో క్రికెట్ వినోదం మొదలుకానుంది. దిగ్గజ క్రికెటర్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్యన తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు పాక్షిక షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. త్వరలో భారత్ లో లోక్ సభ, ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు ఉండడమే దీనికి కారణం.
అచ్చం వారిలాగానే..
ఐపీఎల్ అంటే మహా క్రేజ్. లీగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కోట్లాదిమంది కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తుంటారు. రెండు నెలల పాటు సాగిన తర్వాత లీగ్ అయిపోతే అప్పుడే అయిపోయిందా? అని ఉసూరుమంటుంటారు. కాగా, ఇటీవల ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఓ వీడియో వైరల్ అయింది. దీనిపైనే ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. అంతగా ఆ వీడియోలో ఏమున్నదంటే.. అచ్చం మన స్టార్ క్రికెటర్లలాగానే కొందరు వ్యక్తులు ఉండడమే.
ధోని, కోహ్లి,ధావన్.. దాని పేరు డీపీఎల్
మ్యాచ్ కోసం సిద్ధమైన అదొక మైదానం.. అక్కడ కోహ్లి, ధోని, ధావన్ ఉన్నారు.. ఏదో విషయం చర్చిస్తున్నారు. వారికి క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ సలహాలు ఇస్తున్నాడు. కోహ్లి తనదైన శైలిలో సీరియస్ గా వీటిని వింటుండగా.. ధోని ఏమో ఎలా ఉందో చెబుతున్నాడు. మధ్యలో ధావన్ కల్పించుకుని తన అభిప్రాయం వెల్లడించాడు. అదేంటి..? సచిన్ కశ్మీర్ లో ఉన్నాడు కదా...? కోహ్లికి లండన్ లో కుమారుడు పుట్టాడు కదా..? ధోని అప్పుడే మైదానంలోకి దిగాడా..? ధావన్ ఇటీవల కనిపించడమే లేదు కదా..? మరి వీళ్లంతా ఎలా కలిశారు..? ఇవన్నీ సగటు వ్యక్తికి వచ్చే సందేహాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూస్తే ఎవరికైనా ఇంతే అనిపిస్తుంటుంది. కానీ, అది నిజమైన వీడియో కాదు. అందరూ తీవ్రంగా చర్చిస్తున్నట్లున్న ఆ వీడియోలో ఉన్నవారంతా అచ్చం దిగ్గజ క్రికెటర్ల తరహాలో ఉన్నవారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు బాగా పాపులర్ అయింది. దానిని 'డూప్లికేట్ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)' అని పిలుస్తున్నారు. వీడియోను చూసినవారు ఎవరైనా దీనిని అంగీకరిస్తారు.