మగాళ్లకు డ్వాక్రా సంఘాలు!
దాదాపు 30 ఏళ్లుగా విజయవంతమైన ఈ ఫార్ములాను పురుషులకు వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది.
డ్వాక్రా సంఘాలు అంటే మహిళలే గుర్తుకు వస్తారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయంశక్తి సంఘాల పేరిట దాదాపు మూడు దశాబ్దాల క్రితం మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి. పది నుంచి పదిహేను మందితో ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారిలో పొదుపు అలవాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, తిరిగి వారు సక్రమంగా చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయడం డ్వాక్రా సంఘాల ప్రత్యేకత. దాదాపు 30 ఏళ్లుగా విజయవంతమైన ఈ ఫార్ములాను పురుషులకు వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. మహిళా సంఘాల మోడల్లో పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటుచేసి రుణాలిప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా 20 గ్రూపులను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 1995లో తొలిసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక గ్రుపులను ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం నింపడంతోపాటు వారి ఆర్థిక ప్రగతికి పునాదులు వేశారు. పొదుపు సంఘాలుగా గుర్తింపు పొందిన ఈ మహిళా సంఘాలు కాలక్రమంలో ఎంతో బలోపేతమయ్యాయి. ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. మహిళల పేరిట బ్యాంకులు రుణాలివ్వడం, వారే ప్రతి నెలా సక్రమంగా చెల్లించే చూసేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో చిన్నగా మొదలైన మహిళా సంఘాలు ఇప్పుడు రూ.20 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నాయి. ఇదే సమయంలో పురుషులు ఉపాధి కోసం రుణాలు దొరకడం కష్టంగా మారింది. ఏ వ్యక్తికైనా రుణమివ్వాలంటే బ్యాంకులు నానా ఇబ్బందులు పెడుతున్నాయి. రోజులు తరబడి తిప్పుకుంటున్నాయి. దీంతో చిరువ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టతరమవుతోంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఆన్ లైన్ ద్వారా రుణాలు తీసుకుని వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఈ ఆన్ లైన్ వేధింపులపై చర్చ కూడా జరిగింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి మహిళా సంఘాల మోడల్లోనే పురుషులతోనూ సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ఆదేశించారు. ఇది ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో మొదలవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందనేదానిపై ఆసక్తి పెరుగుతోంది.
పురుష సంఘాలను కామన్ ఇంట్రెస్టు గ్రూపుగా పిలుస్తున్నారు. రుణాల కోసం ఒకే రకమైన ఆసక్తితో ఉన్నవారు ఈ గ్రూపుల్లో చేరవచ్చు. భవన నిర్మాణ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, వాచ్ మన్, జొమాటో, స్విగ్గీ డెలవరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేసుకునే కార్మికులు, వీధి వ్యాపారులు ఈ గ్రూపుల్లో చేరవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులను ఈ గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుతారు. కనీసం ఐదుగురితో ఒక గ్రూపు ఏర్పాటు చేసి వారితో బ్యాంకు అకౌంట్ ప్రారంభించి పొదుపు ద్వారా రుణాలిప్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో ప్రారంభించిన ఈ కామన్ ఇంట్రెస్టు గ్రూపులు ప్రస్తుతం 20 పని ప్రారంభించాయి. ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.