పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు!
ఏపీలో ఎన్నికలకు ముందు సుమారు 58 నెలల పాటు ప్రతీ నెలా ఒకటో తేదీన అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి ఉదయాన్నే పించన్ అందించే సౌకర్యం ఏపీ సర్కార్ కల్పించిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఎన్నికలకు ముందు సుమారు 58 నెలల పాటు ప్రతీ నెలా ఒకటో తేదీన అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి ఉదయాన్నే పించన్ అందించే సౌకర్యం ఏపీ సర్కార్ కల్పించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను వాలంటీర్లపై పెట్టారు జగన్. అయితే.. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో ఆ పని చేయించొద్దంటూ ఫిర్యాదులు చేయడం.. వాలంటీర్లను ఆపడం తెలిసిందే. దీంతో ఏప్రిల్ నెలలో పెన్షన్ దారులు పడిన ఇబ్బందులు ఎన్ననేది తెలిసిన విషయమే.
ప్రశాంతంగా ఇంటివద్ద ఉండి నాలుగు సంవత్సరాల పదినెలలు పెన్షన్ తీసుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఏప్రిల్ 1న గ్రామ/వార్డు సచివాలయాలకు కాల్చీడుకుంటూ వెళ్లారు. రెండు మూడు కిలోమీటర్లు వెళ్లలేరా అంటూ ఈ సమయంలో కొంతమంది మానవత్వం మరిచిన విమర్శలు కూడా చేశారు. ఆ నెలలో వాలంటీర్లతొ పెన్షన్ ఇంటికి అందక, ఎండలో పడి తిరగడంతో సుమారు 32 మంది మృతి చెందారని చెబుతున్నారు.
ఈ సమయంలో మే నెలలో ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి.. ఇప్పటికే సూర్యుడు 42 - 45 డిగ్రీల టెంపరేచర్ తో అల్లాడిస్తున్నా వేళ... వారి పరిస్థితి తలచుకుని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్లను తప్పించకపోతే ఈ ఇబ్బందులే లేవు కదా అనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ సమయంలో... ఎన్నికల సంఘం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలపై సూచనలు చేసింది.
అవును... మరో నాలుగు రోజుల్లో పెన్షన్ తేదీ వస్తున్న నేపథ్యంలో... వాటి పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమయంలో... పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం... పెన్షన్ ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఇదే క్రమంలో... పింఛన్ల విషయంలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా... లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది.