వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
అంతే కాదు ప్రభుత్వ యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుకు వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది.
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంతవరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో అసలు పంపిణీ చేయించవద్దని సూచించింది. అలాగే డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది.
ఈ అంక్షలు అన్నీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు వర్తిస్తాయని పేర్కొంది. అదే విధంగా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు సహా ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ ఆదేశంగా ఉంది. అంతే కాదు ప్రభుత్వ యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుకు వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. ఇక ప్రతీ నెలా మొదటి తేదీన ఇళ్ల వద్దకు వచ్చి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ విషయంలోనూ కీలక సూచనలుచెసింది. ఆయా సామాజిక పెన్లన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను వాడొద్దు అని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే దీని మీద వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇది వాలంటీర్ల మీద తీసుకున్న చర్య కాదు అన్నారు. పెన్షన్ కోసం బయటకు రాలేని వయో వృద్ధులైన అవ్వా తాతలకు ఇబ్బంది అని ఆయన అన్నారు. వారే నష్టపోతారు అని అంబటి అంటున్నారు.
ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. వాలంటీర్ల మీద విపక్షాలు విష ప్రచారం చేశాయని వారి తరఫున ముఖ్యంగా టీడీపీ తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఫిర్యాదుని ఈసీకి చేసి వాలంటీర్ల మీద ఆంక్షలు వచ్చేలా చూసారని అంబటి ఆరోపించారు.
ఇదిలా ఉంటే అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ వైసీపీ తరఫున అని భావించాలి. వాలంటీర్లు ప్రతీ నెలా ఇంటింటికీ తిరిగి పెన్షన్లు మంజూరు చేస్తూ వస్తున్నారు. వారి వల్ల అవ్వా తాతలతో పాటు అన్ని వయసుల వారూ నేరుగా పెన్షన్ అందుకుంటున్నారు. ఏప్రిల్, మే ఈ రెండు నెలలూ వారికి పెన్షన్ కోసం వాలంటీర్లు ఇళ్ళ వద్దకు రాకపోతే వాలంటీర్ల విలువ వైసీపీ ప్రభుత్వం వారికి చేసిన మేలు అన్నది తెలిసి వస్తుందని కూడా ఆ పార్టీ భావిస్తోంది.
ఇదంతా విపక్షాల కుట్ర అని ఆయా వర్గాలకు చెప్పి మరింత సానుభూతిని పొందేందుకు కూడా వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా వాలంటీర్ల చుట్టూ సాగిన ఏపీ రాజకీయంలో ఇది కీలక పరిణామం అని అంటున్నారు. ఇక మీదట వాలంటీర్లను వైసీపీ మరింతగా తమ వైపు తిప్పుకుని వారి ద్వారా ఇప్పటికే గుర్తించిన ఆయన కుటుంబాలను అనుకూలం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వాలంటీర్లను తప్పించడం వల్ల వారు విపక్షాల మీద ఆగ్రహంగా ఉంటారని వైసీపీ అంచనా వేస్తోంది.
ఒక వైపు టీడీపీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను బాగా చూసుకుంటామని చెబుతూ ఇపుడు ఈ విధంగా ఈసీకి ఫిర్యాదు చేయించి విధుల నుంచి తప్పించడం ద్వారా విపక్షాలు వాలంటీర్లకు మరింత దూరం అయ్యాయని వైసీపీ అంటోంది. అదే టైంలో అవ్వా తాతలు ఇతర లబ్దిదారులు కూడా తమకు తగిన సదుపాయాలు వాలంటీర్ల ద్వారా అందకపోవడానికి విపక్షాలే కారణం అనుకుంటారని అంతిమంగా ఇది తమకు మేలే చేస్తుందని వైసీపీ అంచనా కడుతోంది.