అజహర్ పై ఈడీ నజర్.. నోటీసులిచ్చిన దర్యాప్తు సంస్థ

1985లో టీమ్ ఇండియాలోకి వస్తూనే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు అజహర్. టెస్టుల్లో ఇప్పటికీ ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు.

Update: 2024-10-03 07:13 GMT

భారత క్రికెట్ కు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా పనిచేసిన హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ చిక్కుల్లో పడ్డాడు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అవినీతికి మారుపేరుగా నిలిచే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్ సీఏ)లో జరిగిన ఓ అవకతవకల వ్యవహారానికి సంబంధించి అజహర్ కు గురువారం సమన్లు జారీ చేసింది. భారత క్రికెట్ జట్టుకు దశాబ్దంపైగా ఆడిన అజహర్ దాదాపు 9 ఏళ్లు కెప్టెన్ గా పనిచేశారు. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ 1992, 1996, 1999లలో అతడే భారత జట్టును నడిపించాడు. అయితే, వీటిలో 1996 ప్రపంచ కప్ సొంతగడ్డపైనే జరిగింది. టీమ్ ఇండియా సెమీఫైనల్స్ కు చేరింది. కానీ విజేతగా నిలవలేదు. 1992లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, 1999లో ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ కప్ లలో మన జట్టు సెమీస్ వరకు కూడా వెళ్లలేదు.

హ్యాట్రిక్ సెంచరీలతో..

1985లో టీమ్ ఇండియాలోకి వస్తూనే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు అజహర్. టెస్టుల్లో ఇప్పటికీ ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. తనదైన మణికట్టు మాయాజాలంతో గొప్ప బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో వేటుకు గురైనా.. తిరిగొచ్చాడు. అయితే, 2000 సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం అతడి క్రీడా జీవితానికి తెరదించింది. దీంతో 99 టెస్టుల వద్దనే ఆగిపోయాడు. ప్రతి క్రికెటర్ కలగనే 100 టెస్టుల మైలురాయిని అందుకోలేకపోయాడు. అటువైపు బీసీసీఐ కూడా అజహర్ పై నిషేధం విధించింది. క్రికెట్ వ్యవహారాలకు సంబంధించి పదేళ్లకు పైగా ఎలాంటి పదవీ చేపట్టలేకపోయాడు. భారత క్రికెట్ దిగ్గజాల జాబితాలోనూ అతడికి చోటు దక్కలేదు.

మొరాదాబాద్ ఎంపీ..

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున యూపీలోని మొరాదాబాద్ నుంచి అజహరుద్దీన్ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆ పదవిలో ఉండగానే 2012 నవంబరు 8 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి విముక్తుడిని చేసింది. 2019లో హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయ్ మాదోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అజహర్.. 2018లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవకలపై అజహర్ కు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం సమన్లిచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తొలిసారి సమన్లు అందుకున్న ఆయన గురువారం ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంకు సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News